సామాజికవర్గాల వారీగా వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. బహుశా వచ్చే ఆరునెలల్లో ఇతర పార్టీల నుండి మరిన్ని వలసలు వైసీపీలోకి రావచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది.
రాజధాని ప్రాంతంలో వైసీపీని బలోపేతం చేయటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు సమాచారం. గడచిన రెండున్నర సంవత్సరాలు జగన్ వివిధ అంశాలపై రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జిల్లాల వారీగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాని రాజధాని ప్రాంతమైన విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాపై పెద్దగా దృష్టి సారించలేదు. అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే టిడిపి ఇటు విజయవాడలోను, అటు రెండు జిల్లాలోనూ గట్టి స్ధితిలో ఉంది.
వచ్చే ఎన్నికలకు ఉన్నది రెండున్నరేళ్ళే. కాబట్టి, ఇప్పటి నుండి గట్టి పునాది వేసుకోకపోతే ఇబ్బందవుతుందని పార్టీలోని సీనియర్లు కూడా జగన్ కు చెప్పినట్లు సమాచారం. అందుకు జగన్ కూడా సానుకూలంగానే స్పందించారు. మొదట విజయవాడపై దృష్టి పెట్టారు. విజయవాడలో ఎన్ని కులాలున్నా, మొదటి నుండి కాపు, కమ్మ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అయితే, కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, యాదవుల జనాభా కూడా గణనీయంగానే ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ, కమ్మేతర సామాజిక వర్గాలుగా సమీకరణలు మారిపోయాయి. కారణాలేవైనా కాపులు, కమ్మ సామాజిక వర్గాలు ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు అంత ఉత్సాహం చూపటం లేదు. వంగవీటి రాధాకృష్ణ పార్టీలోనే ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం కనబడటం లేదని లేదని జగన్ అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. కాబట్టి మిగిలిన సామాజిక వర్గాలపైనే ముందు దృష్టి సారించారట.
ఇందులో భాగంగానే ముందు వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలపై జగన్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. భాజపాలో క్రియాశీలకంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్, జగన్మోహన్ శర్మలను ఇటీవలే పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలను కూడా త్వరలో వైసీపీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముందు విజయవాడలో పార్టీని పటిష్టం చేసిన తర్వాత పై రెండు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. యాదవ సామాజికవర్గం నుండి ఎటుతిరిగీ పార్ధసారధి పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు.
మంత్రివర్గ ప్రక్షాళన నేపధ్యంలో టిడిపిలో మొదలైన అంసతృప్తులను కూడా జగన్ గమనిస్తున్నారు. వీరిలో ఎంతమంది నిజంగా చంద్రబాబుపై వ్యతిరేకంగా ఉన్నారు, అటువంటి వారిలో ఎంతమంది పార్టీకి పనికివస్తారనే విషయాన్ని అంచనా వేసుకుంటున్నారట. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడింది. కాబట్టి దానికి అనుగుణంగా సామాజికవర్గాల వారీగా వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. బహుశా వచ్చే ఆరునెలల్లో ఇతర పార్టీల నుండి మరిన్ని వలసలు వైసీపీలోకి రావచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది.
