తామిద్దరిలో ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్ధితిని చంద్రబాబుకు పవన్ సృష్టిస్తున్నారు. ఆ పరిస్ధితే వస్తే చంద్రబాబు తన ఓటును వెంకయ్యకే వేస్తారనటంలో సందేహం అక్కర్లేదు. ఆ విషయాన్ని పవన్ కాస్త ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అందుకే ఆలస్యమైనా
జనేసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశంపార్టీకి దూరమవుతున్నట్లే కనబడుతోంది. ప్రత్యేకహోదా అంశాన్ని నినాదంగా ఎప్పుడైతే అందుకున్నారో అప్పుడే టిడిపికి దూరంగా జరగాల్సిన అవసరాన్ని పవన్ గ్రహించినట్లున్నారు. వివిధ అంశాలతో పాటు ప్రత్యేకహోదా విషయంపై చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం తాను చేయించుకున్న సర్వేల్లో స్పష్టంగా పవన్ కు తెలిసిందని సమాచారం. దానికితోడు ప్రస్తుత పరిస్ధితిల్లో ఏపికి ప్రత్యేకహోదా రాదన్నదీ తేలిపోయింది.
మొన్నటి వరకూ రాజకీయాలను పవన్ అంత సీరియస్ గా తీసుకోలేదన్నది వాస్తవం. ప్రజల మనోభావాలను తెలుసుకున్న తర్వాతే సీరియస్ రాజకీయాలు చేయాల్సిన అవసరాన్ని పవన్ గుర్తించారు. అదేసమయంలో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం కూడా పవన్ లో స్పూర్తిని నింపినట్లే ఉంది. మొన్నటి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు చేయాలనుకున్న యువతకు పవన్ ట్వీట్లు టానిక్ లాగ పనిచేసింది. అయితే, తాను స్వయంగా హాజరై వుంటే ఇంకా బాగుండేది. కానీ ఆ రోజు పవన్ అసలు ఎక్కడా కనబడలేదు.
గడచిన రెండున్నరేళ్ళుగా కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నది వాస్తవం. అయితే అప్పట్లో పవన్ ఎన్నడూ ఇటు చంద్రబాబును కానీ అటు మోడిని కాని ప్రశ్నించలేదు. పైగా తాను ఎప్పుడు మాట్లాడినా ఇద్దరినీ వెనకేసుకొచ్చినట్లే కనబడేది. అయితే, జల్లికట్టు తర్వాతే పవన్ వరస కాస్త మారింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ఖాతరు చేయకపోవటంలో చంద్రబాబు వైఫలం కూడా బాగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలా వద్దా అన్నది పూర్తిగా మోడి నిర్ణయంపైనే ఆధారపడివుంది. వెంకయ్యతో కలిపి మంత్రివర్గం మొత్తం ఉత్సవ విగ్రహాలే.
ఈ నేపధ్యంలో ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేయాలని యువతకు పిలుపినిచ్చిన పవన్ ఇక ముందుకు సాగాల్సిందే. అదే సమయంలో వెంకయ్యను పదేపదే లక్ష్యం చేసుకోవటం ద్వారా చంద్రబాబుకూ దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, చంద్రబాబు, వెంకయ్యల బంధం అందరికీ తెలిసిందే. అందులోనూ ఇంతకాలం పవన్ను వెనకుండి నడిపిస్తున్నది చంద్రబాబే అన్న అనుమానాలు అందరిలోనూ ఉంది. అది తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత పవన్ పైనే ఉంది. అందుకే పవన్ ముందు వెంకయ్యను లక్ష్యంగా చేసుకున్నట్లు కనబడుతోంది. తామిద్దరిలో ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్ధితిని చంద్రబాబుకు పవన్ సృష్టిస్తున్నారు. ఆ పరిస్ధితే వస్తే చంద్రబాబు తన ఓటును వెంకయ్యకే వేస్తారనటంలో సందేహం అక్కర్లేదు. ఆ విషయాన్ని పవన్ కాస్త ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అందుకే ఆలస్యమైనా దూకుడు పెంచుతున్నారు.
