ఏపికి జరిగిన అన్యాయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిరాహారదీక్ష చేయనున్నారా? అవుననే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. పవన్ వీరాభిమానో లేకపోతే ఆగర్భశతృవో అర్ధం కాని సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చేసిన ఓ ట్వీట్ తో సంచలనం మొదలైంది. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పవన్ చేయనున్న ఆమరణ దీక్షకు తమ మద్దతుంటుందని మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

దానికి తోడు కొంతకాలంగా ఏపి ప్రయోజనాలు, విభజన చట్టం హామీలపై కేంద్ర వైఖరిపై పవన్ మండిపడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి గురించి ప్రస్తావనే లేకపోవటంతో యావత్ రాష్ట్రం మండిపోతోంది. జనాల మూడ్ గ్రహించే మిత్రపక్షం టిడిపి కూడా పార్లమెంటు వేదికగా ఆందోళనలంటూ నానా హడావుడి చేస్తోంది.

ఈ నేపధ్యంలోనే ఢిల్లీలో పవన్ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు కత్తి మహేష్  ట్వీట్ చేయటం సంచలనంగా మారింది. దానికితోడు మరికొద్ది సేపటిలో బుధవారం పవన్ మీడియా సమావేశం నిర్వహిస్తారంటూ మధ్యహ్నం 2 గంటల నుండి ట్విట్టర్ వేదికగా సమాచారం అందుతోంది. దాంతో పవన్ నిరాహార దీక్ష పై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 21నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నా మద్దతు తెలుపుతున్నాను’’ అని మహేష్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ పవన్‌పై కారాలు మిరియాలూ నూరిన మహేష్ ఇప్పుడిలా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ ప్రెస్‌మీట్‌లో పవన్ తన కార్యాచరణను వెల్లడిస్తారేమో వేచి చూడాలి.