దీపావళి తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. పైగా పనితీరు ఆధారంగా 6గురు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీపావళి పండుగ తర్వాత మరోసారి మంత్రివర్గ ప్రక్షాళన జరగటం ఖాయమని టిడిపి సోర్సెస్ చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురి పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. పోయినసారి మంత్రివర్గ విస్తరణప్పుడే ఇదే జట్టు ఎన్నికల వరకూ ఉంటుందని టిడిపి నేతలు అనుకున్నారు. అయితే, పలువురి పనితీరు చాలా దారుణంగా ఉండటంతో మార్పులు తప్పవని చంద్రబాబు నిర్ణయించారట.

వచ్చేనెలలో దీపావళి తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. పైగా పనితీరు ఆధారంగా 6గురు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గం నుండి ఊస్టింగ్ తప్పదని ప్రచారంలో ఉన్న పేర్లలో ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు అచ్చెన్నాయడు, గంటా శ్రీనివసరావు ఉన్నాయి. ఇక, కర్నూలు జిల్లా నుండి భూమా అఖిలప్రియకూ ఉధ్వాసన తప్పదట. మంత్రి శిద్ధా రాఘవరావు కూడా పదవిని కోల్పోక తప్పదంటున్నారు. ఎందుకంటే, ప్రకాశం జిల్లాలో ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కోసం.

ఇక, భాజపాకు చెందిన ఇద్దరు మంత్రుల పనితీరు కూడా ఏమీ బాగాలేదట. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాసరావు పూర్తిగా విఫలమైనట్లు అన్నీ వర్గాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కామినేని ఎంతగా చంద్రబాబు వీరాభిమాని అయినా రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి తప్పించక తప్పదట. ఇక, మాణిక్యాలరావు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయనకు అటు సిఎంతోనే కాదు ఇటు ఉన్నతాధికారులతో కూడా సఖ్యత లేదు. పనితీరు కూడా అంతంతమాత్రమే. కాకపోతే వీరిద్దరిని తప్పించటమన్నది చంద్రబాబు చేతిలో లేదు. భాజపా కేంద్ర నాయకత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

వీరి స్ధానంలో ఎవరిని తీసుకుంటారన్న విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. ఎందుకంటే, పోయినసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ల అలకలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా మంత్రివర్గంలో చోటు రాలేదన్న కోపంతో బోండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, బుచ్చయ్యచౌదరి, గౌతు శ్యామ్ సుందర శివాజి, కాగిత వెంకట్రావు, అనిత తదితరులు దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేసారు. ఆ విషయం ఎవ్వరూ మరచిపోలేదు. అందులోనూ త్వరలో ఏర్పాటయ్యేది ఎన్నికల జట్టే అనటంలో సందేహం అవసరం లేదు. ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లు పార్టీ మారే అవకాశం కూడా ఉండంటతో చంద్రబాబు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.