ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మరేం చేయాలి? టిడిపికి భజన చేయాలా? చంద్రబాబు పాలన బ్రహ్మాండమనాలా? కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. పొరబాటున టిడిపి అదృష్టం తారుమారైతే అప్పుడు చంద్రబాబు పరిస్ధితేంటి?
పేటెంట్ హక్కులంటే ఏమిటి? తమ ఆవిష్కరణల ద్వారా తయారైన ఓ ఉత్పత్తిని ఇతరులెవరూ ఉత్పత్తి చేయకుండా ఉండటం. ఎవరైనా ఉత్పత్తి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు సదరు ఉత్పత్తిని ఆవిష్కరించిన సంస్ధకుంటుంది. అదే పేటెంట్ హక్కు. ఇప్పుడిదంతా ఎందుకంటే, రాష్ట్రంలో గడచిన మూడేళ్ళుగా నైతికహక్కుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఆయనకు నైతికహక్కు లేదంటూ చంద్రబాబునాయుడు దగ్గర నుండి మంత్రులు, నేతలు ఎదురుదాడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటికేదో నైతికతపై టిడిపికే పేటెంట్ హక్కులున్నట్లు.
తాజాగా విశాఖపట్నం భూకుంభకోణంపై జగన్ విశాఖలో ఈరోజు మహాధర్నా చేయబోతున్నారు. ఆ విషయమై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం మీడియాలో మాట్లాడుతూ, అవినీతి గురించి మాట్లాడే నైతికహక్కు జగన్ కు లేదని తేల్చేసారు. రాష్ట్రంలో జరిగే ఏ విషయం మీద కూడా మాట్లాడే నైతికహక్కు జగన్ కు లేదూ అంటే అసలు జగన్ ఏం మాట్లాడాలి? అదికూడా చంద్రబాబే చెబితే బాగుంటుంది.
10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీక్ గురించి మాట్లాడేందుకు లేదు. రైతు, డ్వాక్రా రుణాల్లోని అవక తవకల గురించి మాట్లాడకూడదు. ఇసుక అక్రమ వ్యాపారాలు, భూకుంభకోణాలు, రాజధాని, పోలవరం తదితరాల అవినీతి గురించి మాట్లాడకూడదు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశాలపై నిరసనలు తెలియజేయకూడదు, ఎక్కడా ప్రస్తావించకూడదు.
అసెంబ్లీలో జగన్ను మాట్లాడనీయరు. బయటా మాట్లాడేందుకు లేదు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు బాధిత కుంటుంబాలను పరామర్శించే క్రమంలో అధికారులను నిలదీస్తే కేసులు పెడతారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమంటారు. గడచిన మూడేళ్ళుగా జగన్ పై టిడిపి చేస్తున్న ప్రచారం ఇదే. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపకూడదు. అధికారపార్టీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదు.
ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మరేం చేయాలి? టిడిపికి భజన చేయాలా? చంద్రబాబు పాలన బ్రహ్మాండమనాలా? కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. పొరబాటున టిడిపి అదృష్టం తారుమారైతే అప్పుడు చంద్రబాబు పరిస్ధితేంటి?
