‘‘నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలంటే డబ్బులు ఎక్కడున్నాయ్’’..ఇవి తాజాగా చంద్రబాబునాయుడు నేతలను ఉద్దేశించి వేసిన ప్రశ్న. శనివారం ఉదయం సమన్వయ కమిటి సమావేశం జరిగింది.  ఆ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని నేతలు ప్రస్తావించారట. దాంతో సిఎం డబ్బులు లేవని సమాధానమిచ్చారు. అంటే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే వారికి జీత, బత్యాలు, వాహనాలు, మోబైల్ ఫోన్ తదితర ఖర్చులు అనేకముంటాయి లేండి.

ప్రస్తుత పరిస్ధితిలో ఒకరినో, ఇద్దరినో నియమిస్తే కుదరదు కదా? అసలే, ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయ్. కాబట్టి పోస్టులను ఆశించే నేతలు ఎక్కువమందే ఉన్నారు. ఒకరికిచ్చి మరొకరికి ఇవ్వకపోతే పెద్ద తలనొప్పవుతుంది. అందుకనే ఎవరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లున్నారు.

మరి, మూడేళ్ళుగా పోస్టుల భర్తీ చేస్తారని, తమకు అవకాశాలు వస్తాయని కళ్ళు కాయలుకాచేలా ఎదురు చూస్తున్న వారి మాటేంటి? చంద్రబాబు తాజా వ్యాఖ్యల ప్రకారం వారంతా ఆశలు వదులేసుకోవాల్సిందేనా? సమన్వయ కమిటి సమావేశం తర్వాత నేతల మధ్య ఇదే చర్చ మొదలైంది. తప్పని పరిస్ధితుల్లో నియమించాల్సిన టిటిడి ట్రస్ట్ బోర్డు లాంటివి తప్ప ఇంకేమీ భర్తీ చేసేట్లు కనబడటం లేదు చంద్రబాబు.