స్వామివారి దర్శనం కోసం వచ్చే సెలబ్రిటీలందరూ ఎవరికి వారు తమకు అద్భుత దర్శనం కావాలని కోరుకుంటారు.
ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు విచిత్రంగా మాట్లాడుతున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనంలో అధికారులు వివక్ష చూపిస్తున్నట్లు తీవ్ర ఆవేధన చెందారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న మోహన్ బాబును ఆలయంలో ధ్వజస్ధంబాన్ని తాకే అవకాశం కల్పించలేదట.
దాంతో మండిపడ్డ మోహన్ బాబు ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆలయ అధికారులపై మండిపడటం ఆశ్చర్యంగా ఉంది. స్వామివారి దర్శనం విషయంలో వివక్ష చూపించమని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో కేవలం వివిఐపిలకు, డబ్బున్నవారికే దర్శనం దొరుకుతోందని ఆరోపించారు.
ఇక్కడే ఒక విషయం అర్ధం కావటం లేదు. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో వివక్ష అన్నది ఇప్పటి మాట కాదు. దశాబ్దాల నుండి వస్తూనే ఉంది. ఈ విషయం మోహన్ బాబుకు ఇపుడే తెలిసిందా?
స్వామివారి దర్శన కోసం దేవస్ధానమే వివిధ క్యాటగిరీలు ఏర్పాటు చేసిన సంగతి కొత్తేమీ కాదు. సర్వదర్శనం, విఐపి బ్రేక్, వివిఐపి బ్రేక్, కల్యాణోత్సవం బ్రేక్ పేరిట ఎన్నో రకాల దర్శనాలు చాలా కాలంగా అమలవుతోంది.
చిత్తూరు జిల్లాకే చెందిన మోహన్ బాబుకు ఈ విషయాలు తెలియవని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే, మొన్నదర్శనం సమయంలో ఆయన అనుకున్నట్లు అధికారులు మర్యాదలతో దర్శనం చేయించి వుండకపోవచ్చు.
ఎందుకంటే, స్వామివారి దర్శనం కోసం వచ్చే సెలబ్రిటీలందరూ ఎవరికి వారు తమకు అద్భుత దర్శనం కావాలని కోరుకుంటారు.
అది జరగనపుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అధికారులపై బురదచల్లటం మామూలే. చూడబోతే మోహన్ బాబు కూడా అటువంటిదేదో ఆశించి భంగపడినట్లుంది. అది దక్కక పోయేటప్పటికి మీడియాకు ఎక్కారు అంతే.
