బడ్జెట్ విషయంలో నిరసనలు తెలపటానికి టిడిపి నానా అవస్తలు పడుతోంది. సోమవారం పార్లమెంటులో నిరసనలు తెలిపేటపుడు ఆ విషయం స్పష్టంగా బయటపడింది. ఐదు రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఏపిలో ప్రకంపనలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. మిత్రపక్షాలే అయినప్పటికీ బడ్జెట్ కేంద్రంగా టిడిపి-బిజెపి మధ్య మాటల యుద్దం రోజురోజుకు తీవ్రమవుతోంది. బడ్జెట్ విషయంలో పార్లమెంటులో అనుసరించాల్సిన విషయమై ఆదివారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఎంపిలు సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటులో నిరసనలు తెలపాలని కూడా నిర్ణయించారు.

అంతా బాగానే ఉంది కానీ సోమవారం పార్లమెంటులో నిరసనలు తెలిపే సమయంలోనే సమస్య మొదలైంది. ఎందుకంటే, కేంద్రప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామే అన్న విషయం తెలిసిందే. టిడిపి తరపున ఎంపిలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగిన తర్వాత నిరసనలు గట్రాలను సుజనా చౌదరే మీడియాకు చెప్పారు.

అయితే, అంత గట్టిగా చెప్పిన సుజనా సోమవారం పత్తాలేరు. ఉదయం పార్లమెంటు మొదలైన దగ్గర నుండి ఎంపిలతో ఎక్కడా కనబడలేదు. సుజనానే కాదు అశోక్ కూడా అడ్రస్ లేరు. ధర్నా చేస్తామన్నారు. నిరసనలు తెలుపుతామన్నారు. పార్లమెంటులో ఆందోళనలు చేస్తామన్నారు. సస్పెండ్ అయినా పర్వాలేదు నిరసనలు మాత్రం గట్టిగా చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు పచ్చ మీడియాలో రాయించుకున్నారు.

ఆందోళనల గురించి ఆదివారం అంత చెప్పిన  సుజనా చౌదరి సోమవారం ఎక్కడా పత్తా లేకపోవటమే ఆశ్చర్యం. టిడిపి ఎంపిలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేసారు. అయితే, సుజనా చుట్టుపక్కల ఎక్కడా కనబడలేదు. కేంద్రంలో మంత్రిగా ఉంటూ ఎంపిలతో కలిసి అదే ప్రభుత్వంపై నిరసన తెలిపితే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఊరుకుంటారా? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుంటారు. అందుకనే సుజనా పత్తాలేకుండా పోయారంటూ గుసగుసలు మొదలయ్యాయి.