మొత్తానికి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి కలిసి జనాలను పిచ్చివాళ్ళను చేస్తున్నాయి. గడచిన మూడున్నరేళ్ళుగా కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన ‘లెక్కల’ పై సరికొత్త రాజకీయం మొదలుపెట్టాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటులో గానీ రాష్ట్రంలో కానీ తలెత్తిన పరిణామాలు అందరికీ తెలిసిందే. మొన్న ప్రవేశపెట్టిందే ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కాబట్టి, త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టే టిడిపి రాద్దాంతం మొదలుపెట్టింది.

పైగా ప్రతీ సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైనదానికన్నా ఎక్కువే కేంద్రం సాయం చేస్తోందంటూ చంద్రబాబునాయుడే స్వయంగా చెప్పారు. కేంద్రమంత్రులు కానీ ఎంపిలు కానీ పొరబాటున కూడా కేంద్రం అందిస్తున్న నిధులపై ఏనాడు మాట్లాడలేదు. కేంద్రమంత్రులు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ప్రత్యేకంగా రాష్ట్రంలో బహిరంగసభలు పెట్టి రాష్ట్రానికి కేంద్రం ఏమేరకు సాయం చేసిందో చాలాసార్లే వివరించారు. అప్పుడు కూడా టిడిపి తరపున ఎవరూ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

మొన్నటి బడ్జెట్ ముందే రెండు పార్టీల మధ్య పొత్తులపై అనేక ప్రచారాలు మొదలయ్యాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు కలిసి పోటీ చేసేది అనుమానంగా తయారైంది. ఏ రోజైనా రెండు పార్టీల మధ్య పొత్తులు విచ్చిన్నం కావచ్చని రెండు పార్టీల నేతలు బాహటంగానే ప్రకటనలిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అటువంటి నేపధ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో రెండు పార్టీల మధ్య వివాదాలు మరింత పెరిగిపోయాయి. దాని పర్యవసానమే ఇపుడు అందరూ చూస్తున్న లెక్కల పంచాయితీ.

మొత్తానికి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్రతీ పైసాకు కచ్చితంగా లెక్కలుంటాయి. అలాగే, రాష్ట్రం ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి లెక్కలుంటాయి. కేంద్రం ఇచ్చింది నిజం..రాష్ట్రం తీసుకున్నది నిజం. మరి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య లెక్కల్లో కొత్తగా పంచాయితీ ఎందుకు మొదలైంది? ఇదే పంచాయితీ ఇంతకాలం ఎందుకు రాలేదు? అంటే, రెండు పార్టీలు కలిసి జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఎందుకంటే, రెండు ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వం చెబుతున్నదే నిజం. లేదా రెండూ కూడబలుక్కుని అబద్దాలన్నా చెబుతుండాలి. ఒక్కటి మాత్రం నిజమని తెలుస్తోంది. అదేమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం అడ్డుగోలుగా ఖర్చు  చేసేసింది. అందుకనే కేంద్రం అడుగుతున్నా లెక్కలు చెప్పటం లేదు. ఈ నేపధ్యంలోనే బిజెపి-టిడిపి మధ్య తేడా మొదలయ్యేటప్పటికి కేంద్రం తదుపరి నిధుల మంజూరును బిగించేసింది. దాంతో చంద్రబాబునాయుడు విలవిల్లాడిపోతున్నారు. సమస్యంతా అక్కడే మొదలై ఇంతదాకా వచ్చింది.