వచ్చే ఎన్నికల్లో ఫలితాలంటూ తాజాగా వెలుగు చూసిన ఓ సర్వే తెలుగుదేశంపార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో వైసిపి శ్రేణుల్లో మాత్రం మంచి జోష్ నింపుతోంది. చంద్రబాబునాయుడు అనుకూల మీడియా సర్వే చేసిందని అంటున్నారు. అయితే, సర్వే ఫలితాలు చూస్తే మాత్రం టిడిపికి బిపి పెరిగిపోవటం మాత్రం ఖాయం. మొన్ననే రిపబ్లిక్ టివి సర్వే ఫలితాలు విడుదలైంది. అందులో 51 శాతం ఓట్ల షేర్ తో వైసిపి అధికారంలోకి రావటం ఖాయమని తేలింది. అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల్లో జగన్ కు స్పష్టమైన ఆధిక్యత కనబడింది.

అదే విధంగా ఈ మధ్యనే ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చేయించారంటూ ఒ సర్వే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అందులో కూడా వైసిపికే స్పష్టమైన మెజారిటీ దక్కింది. ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు అనుకూల మీడియా చేయించిందంటూ ఓ సర్వే వైరల్ గా మారింది.

2019 ఎన్నికలు దగ్గర పడుతోంది. చంద్రబాబు కూడా తరచూ పార్టీ పరిస్ధితిపై సర్వేలు  చేయించుకుంటున్నారు. చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లో కూడా టిడిపికి ఏమంత సానుకూలంగా ఉండటం లేదన్న ప్రచారం పార్టీ నేతల్లోనే జోరుగా ప్రచారంలో ఉంది. ఇటువంటి నేపధ్యంలోనే రిపబ్లిక టివి అని, రాజగోపాల్ పేరుతో సర్వేలో బాగా చక్కర్లు కొట్టాయి. అటువంటి కోవలోకే తాజాగా మరో సర్వే ఫలితాలంటూ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది.

ఆ సర్వే ఫలితాల ప్రకారం టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైసిపికి 158 సీట్లు దక్కుతుందని సర్వేలో స్పష్టమవుతోంది. కాగా టిడిపి కేవలం 17 సీట్లు మాత్రం గెలుచుకుంటుందట. ఇక, జనసేన, బిజెపిల సంగతి సోదిలోకి కూడా లేదు. సరే ఏదేమైనా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటానికి పార్టీల అధినేతలు సర్వేలు చేయించుకోవటం, లీకులివ్వటం మామూలే కదా?