చంద్రబాబునాయుడును రక్షించుకునేందుకు ‘పచ్చమీడియా’ సరికొత్త నాటకానికి తెరలేపింది. విభజన హామీలు, రాష్ట్రప్రయోజనాలపై పార్లంమెంటులో ఎంపిలు ఎంత నిరసనలు తెలిపినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం సమావేశాలు ముగిసిన తర్వాత ఏపి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని ప్రచారం మొదలైంది. బడ్జెట్ తొలివిడత సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి. మళ్ళీ రెండో విడత సమావేశాలు మార్చినెల 5వ తేదీన మొదలవుతాయి.

శుక్రవారం సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, పియూష్ గోయెల్,  భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లతో కేంద్రమంత్రి సుజనా చౌదరి సుదీర్ఘంగా సమావేశమయ్యారట. రైల్వేజోన్ ఏర్పాటు, రెవిన్యూలోటు భర్తీ, పోలవరం నిర్మాణానికి నిధులు, ఇఏపికు కేంద్ర సంస్ధల ద్వారా నిధులు, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం లాంటి డిమాండ్లపై చర్చించారట.

ఏపి ప్రయోజనాలపై కేంద్రం తన ధోరణిని మార్చుకోకపోతే, న్యాయం చేస్తూ వెంటనే ప్రకటన చేయకపోతే మార్చి 5వ తేదీకి భాజపాకు మద్దతుపై తాము పునరాలోచించుకోవాల్సుంటుందని సుజనా హెచ్చరించారట. దాంతో కేంద్రమంత్రులు, అమిత్ షా భయపడిపోయారట. దానికితోడు కేంద్ర-ఏపి మద్య ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రంగంలోకి దిగారట. దాంతో చంద్రబాబు దెబ్బకు కేంద్రం దిగొచ్చిందట.

ఇక్కడే చిన్న మతలబుంది. అదేమిటంటే, పార్లమెంటులో ఎంపిలు ఎంత గందరగోళం చేసినా కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు మొలయ్యాయి. దానితాలూకు సెగలు కేంద్రానికి బాగా తగిలింది. అయినా, ముందు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన ప్రసంగాల్లో ఎక్కడా ఏపి గురించిన ప్రస్తావనే లేదు.

చివరకు మొదటివిడత సమావేశాలు ముగిసాయి. సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్రమంత్రి సుజనా చౌదరితో జరిగిన చర్చల్లో కేంద్రం దిగొచ్చిందంటే నమ్మేదెలా? ఆ దిగొచ్చేదేదో సమావేశాలు జరుగుతున్నపుడే ఎందుకు రాలేదు? సమావేశాలు జరుగుతున్నపుడే దిగొచ్చుంటే భాజపాకు కూడా రాష్ట్రంలో మైలేజీ వచ్చేది కదా?

కేంద్రానికి దిగొచ్చే ఉద్దేశ్యమే ఉంటే ఆ ముక్కేదో పార్లమెంటులోనే ప్రధాని ప్రకటన చేసి ఉండేవారు కదా? అంటే ఇక్కడ అర్ధమవుతోంది ఏమిటంటే? మార్చి 5వ తేదీ వరకూ టిడిపి ఎంపిలు, బిజెపి ఎంపిలు రాష్ట్రంలో జనాల మద్య తిరగాలి. అలా తిరిగే సమయంలో జనాగ్రహానికి ఎక్కడ గురికావాల్సి వస్తుందో అన్న భయంతోనే టిడిపి పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని లీకులతో కొత్త నాటకం మొదలుపెట్టింది.