రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు రావటం అనుమానమేనా? భాజపా నేత దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన తాజా వ్యాఖ్యలు తర్వాత అటువంటి అనుమానాలే మొదలయ్యాయి. ఎందుకంటే, కేంద్రం నుండి తీసుకున్న నిధులకు రాష్ట్రప్రభుత్వం సక్రమంగా లెక్కలు చెప్పటం లేదన్నది వాస్తవం. దాంతో కేంద్రం తర్వాత నిధులను విడుదల చేయకుండా బిగించేస్తోంది. అంటే రాష్ట్రం లెక్కలు చెప్పేది లేదు, కేంద్రం తర్వాత నిధులు విడుదల చేసేది లేదన్నది పురంధేశ్వరి మాటలతో తేలిపోయింది. ఇదే విధంగా కొంతకాలం కాలక్షేపం చేసేస్తే ఎలాగూ ఎన్నికలు వచ్చేస్తాయి.

తీసుకున్న లెక్కలకు లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతుంటే, కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాంతో నిధుల విడుదలలో ప్రతిష్టంభన తప్పటం లేదు. అదే విషయాన్ని పురంధేశ్వరి తాజాగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిందేనంటూ అల్టిమేటమ్ జారీ చేయటం గమనార్హం. కేంద్రం నుండి అందుకుంటున్న నిధులకు రాష్ట్రప్రభుత్వం సరిగా లెక్కలు చెప్పటం లేదని ఆరోపించారు. కేంద్రమిచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోతే ఇంకోసారి నిదులు ఎలా ఇస్తారంటూ నిలదీసారు. కేంద్రానికి లెక్కలు చెప్పకుండా నిధుల విడుదలలో బాగా జాప్యం చేస్తోందని కేంద్రంపై విమర్శలు చేయటంలో అర్ధం లేదన్నారు.

ఇక, పోలవరం గురించి మాట్లాడుతూ అంతమంది కాంట్రాక్టర్లు మారటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రాజెక్టు పనులు చేయటంలో అంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు మారుతున్నారో అర్ధం కావటం లేదని మండిపడ్డారు. పోలవరంకు కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన రాష్ట్రం ఆపని చేయటం లేదన్నారు. తీసుకున్న నిధులకు లెక్కలు చెబితేనే కదా ఎవరైనా నిధులిచ్చేది అంటూ ధ్వజమెత్తారు. లెక్కలు చెప్పకపోతే రాజధాని విషయంలో కూడా కేంద్రం అదే విధంగా వ్యవహరిస్తుందని పురంధేశ్వరి హెచ్చరించటం గమనార్హం.