Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు ఇచ్చిన ఆభరణాలివే.. ఎంత విలువో తెలుసా..?

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తిలు తిరుమల శ్రీవారికి ఆదివారం భారీ విరాళం అందించారు. రెండు కేజీల బరువున్న బంగారు శంఖం, బంగారు తాబేలును సమర్పించారు. 

Infosys chairman Narayana Murthy, Sudha Murty Donate Gold Conch, Tortoise Idol To Tirupati Temple ksp
Author
First Published Jul 18, 2023, 4:44 PM IST

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తిలు తిరుమల శ్రీవారికి ఆదివారం భారీ విరాళం అందించిన సంగతి తెలిసిందే. శ్రీవారికి బంగారు అభిషేక శంఖం, బంగారు తాబేలు విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. దాతృత్వ కార్యక్రమాలకు పెట్టింది పేరైన ఈ దంపతులు తమ విరాళాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. దాదాపు రెండు కిలోల బరువున్న ఈ వస్తువులు శ్రీవారికి అభిషేకం చేయడానికి ఉపయోగపడతాయి. వీటి విలువ రూ.కోటిపైనే వుంటుందని అంచనా. ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎస్ రాజీవ్ కృష్ణ.. ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు నారాయణ మూర్తి దంపతులను ప్రశంసిస్తున్నారు. 

ALso Read: తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతుల భారీ విరాళం.. బంగారు శంఖం అందజేత (వీడియో)

 

 

ఈ జంట తమ దాతృత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి సహాయం చేస్తూనే వున్నారని , అలాగే తమను ఈ స్థాయిలో వుంచిన దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతోమంది ప్రముఖులు, భక్తులు విలువైన వస్తువులను సమర్పిస్తూనే వున్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు గడిచిన ఐదేళ్లలో రూ.10,000 కింద వచ్చిన విరాళాల ద్వారా రూ.880 కోట్లు వచ్చాయని ఈవో ప్రకటించారు. ప్రతి రూ.10 వేల విరాళానికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సర్వదర్శనం సమయంలో కాకుండా ఉదయాన్ని శ్రీవారిని శీఘ్రంగా దర్శించుకోవచ్చు. 

ఇకపోతే.. గత నెలలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ట్రస్ట్‌పై అనవసర ఆరోపణలు మానుకోవాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చని అన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని  చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios