తిరుమల నుంచి రెడ్ శాండల్ అక్రమరవాణా.. ఎక్కడికంటే..
సీఐ అప్పన్న పేరుతో విడుదలైన ఓ ప్రకటనలో తిరుపతి కపిలతీర్థం సర్కిల్లో గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఒక టవేరా వాహనంలో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తిరుపతి : నిషేధిత ఎర్రచందనాన్ని దర్జాగా రాజమార్గంలో రవాణా చేస్తూ పట్టుబడిన ఘటన గురువారంనాడు తిరుపతిలో వెలుగు చూసింది. బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన టిఎన్ 07 ఏ ఆర్ 3333 నెంబర్ తో ఉన్న టవేరా బండి ఎర్రచందనాన్ని తిరుమల నుంచి తిరుపతికి రవాణా చేస్తూ పట్టుబడింది. తిరుమల టూ టౌన్ పరిధిలోని ఘాట్ రోడ్డు ఒకటిలో చెక్పోస్ట్ దగ్గర ఉన్న వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లుగా అక్కడ సిబ్బంది గుర్తించి.. బండిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు.
వాహనంలో ఉన్న ఎర్రచందనం దుంగలు కనిపించకుండా దుప్పటి కప్పారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించలేదు. ఈ విషయాన్ని అలిపిరి పోలీసులను అడిగితే.. తమకేమీ తెలియదని…తాము ఏదీ పట్టుకోలేదని చెప్పుకొచ్చారు. తిరుమల టూ టౌన్ పోలీసుల స్పందన కూడా ఇలాగే ఉంది. దీనిమీద టీటీడీ విజిలెన్స్ కూడా ఒకేలాగా స్పందించడం అనేక అనుమానాలకు దారితీసింది. ఘాట్ రోడ్లో ఎర్రచందనం రవాణా చేస్తున్న వాహనం పట్టుబడినట్లు తమకు సమాచారం లేదని చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ఎర్రచందనం రవాణా వెనక పెద్ద తలకాయలు ఉన్నాయా? ఇంత రహస్యం ఎందుకు? అనే అనుమానాలు.. గుసగుసలు వినిపించాయి.
లారీని ఢీకొట్టిన మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం... ఘటనాస్థలికి చేరుకున్న దేవినేని ఉమ
దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రాత్రి పదిన్నర గంటలకు సీఐ అప్పన్న పేరుతో దీని మీద ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి కపిలతీర్థం సర్కిల్లో గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఒక టవేరా వాహనంలో రవాణా చేస్తున్న 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని తలకోన నుంచి చెన్నైకి తరలిస్తున్నారని తెలిపారు. టవేరా బండిని నడుపుతున్న డ్రైవర్ రాజా వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.