ఓ భర్త భార్యను బీరు సీసాతో కొట్టడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యపై భర్త అమానవీయంగా దాడి చేశాడు. నందిగామ బీసీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య శ్రీలక్ష్మి మీద.. భర్త అతి దారుణంగా బీరుసీసాతో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారు ఆరు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య దగ్గరికి వెళ్లిన భర్త.. ఆమెతో గొడవ పడి బీరు సీసాతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ సతీష్ కుమార్.. బాధితురాలిని తక్షణమే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. భార్య మీద దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద దర్యాప్తు చేపట్టారు.

బీజేపీ శాసనసభ్యులతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు.. స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో గృహహింస అత్యంత ముఖ్యమైంది. భర్త చెప్పినట్టు వినలేదనో.. ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిందనో.. అదనపు కట్నం కోసమో, ఆడపిల్ల పుట్టిందనో.. ఇలా అనేక కారణాలతో నిత్యం వివాహిత మహిళలు హింసలపాలవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ వీడియోలో ఉన్న సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

అందులో ఏముందంటే తన భార్యను ఓ భర్త చితకబాదుతున్నాడు. ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ వీడియోను పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన భార్యను దారుణంగా కొట్టి, వీడియో తీసిన 27 ఏళ్ల యువకుడిని దిలీప్ గా మలైంకీజు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. 

తిరువనంతపురం స్థానికుడైన దిలీప్ భార్య తన మాట వినకుండా సూపర్ మార్కెట్‌లో పనికి వెడుతుందని ఆమెను కొట్టాడు. వీడియోలో దిలీప్ తన భార్యను దారుణంగా కొడుతున్న సమయంలో ‘అప్పు తీర్చాలంటే ఉద్యోగానికి వెళ్లాలి' అని దిలీప్ భార్య చెప్పడం వీడియోలో వినపడుతోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన వీడియోలో మహిళ ముఖం రక్తసిక్తమైంది. దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు మలయంకీజు పోలీసులు నిందితుడిని హత్యాయత్నం, అనేక ఇతర అభియోగాల కింద అరెస్టు చేశారు.

అంతకుముందు, జూన్‌లో, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు వేరొక వ్యక్తితో సంబంధముందని ఆరోపించినందుకు... బూట్ల దండ ధరించి తన భర్తను బలవంతంగా భుజాలపై మోసుకెళ్లింది. దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. ఈ ఘటనలో 11 మంది, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది.