కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరు సెంటర్ వద్దకు ఒకేసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి జోగి రమేశ్‌లు రానుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గూడూరు సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి జోగి రమేశ్‌లు ఒకేసారి ఈ ప్రాంతానికి రానుండటంతో తెలుగుదేశం, వైపీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. గూడూరు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మంత్రి జోగి రమేశ్ రానున్నారు. ఇప్పటికే భారీ కాన్వాయ్‌తో గూడూరు బయల్దేరారు రమేశ్. అటు ఇదే మార్గం గుండా చంద్రబాబు మచిలీపట్నం వెళ్లనున్నారు. ఇద్దరు నేతలకు ఘనస్వాగతం పలికేందుకు గాను భారీ గజమాలలు ఏర్పాటు చేయడంతో పాటు శ్రేణులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చివరి ఏడాది, ఇంకొన్ని నెలలే, సైకో పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇల్లు మీది స్టిక్టర్ సైకోది, మధ్యలో ఆయన పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంటి ఓనర్ పర్మిషన్ లేకుండా స్టిక్కర్లు అతికించడం చట్ట వ్యతిరేకమని టీడీపీ అధినేత చెప్పారు. జగన్ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమని.. ఆయన పోతేనే పిల్లలకు భవిష్యత్తని లేదంటే అంధకారమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని చంపి గుండెపోటు, రక్తపోటని చెప్పారని తన పేరు తీసుకుని రావాలని చూశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెంచారని.. కరెంట్ ఛార్జీలు సైతం పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మీ బిడ్డ కాదని.. క్యాన్సర్ గడ్డంటూ టీడీపీ అధినేత సెటైర్లు వేశారు.
