Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వంపై మండిపడిన హై కోర్టు

  • చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఉమ్మడి హైకోర్టు సీరియస్ అయ్యింది.
High court says administration has become a mess in the state

చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఉమ్మడి హైకోర్టు సీరియస్ అయ్యింది. ‘రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే గుండె దహించుకుపోతోందం’టూ మండిపడింది. ‘పాలన మొత్తం గందరగోళంగా ఉందని, ఇదే పద్దతి కొనసాగితే రాష్ట్రానికి అసలు పెట్టుబడులే రావం’టూ హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఇంతకీ ప్రభుత్వంపై హై కోర్టు అంత సీరియస్ ఎందుకయ్యింది? అంటే, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మడలం చెవిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్కో అనే సంస్ధ స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అందుకు ప్రభుత్వం 30 ఎకరాలను కేటాయించింది. మిల్లు ప్రారంభానికి అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, భూమిని కేటాయించిన ప్రభుత్వం రెవిన్యూ రికార్డుల్లో మాత్రం భూ బదలాయింపు చేయలేదు. దాంతో రికార్డుల్లో ఎక్కడా ఎస్కో కు ప్రభుత్వం భూమి ఇచ్చినట్లు నమోదు కాలేదు. ఇదంతా 1992 నాటి మాట.

భూ రికార్డుల్లో తమ పేరుతో భూములను నమోదు చేయించుకోవటానికి కంపెనీ నానా అవస్తలూ పడుతోంది. భూములు తమ పేరుమీద వస్తే వాటిని తనఖా పెట్టి అప్పు తీర్చుకోవచ్చన్నది కంపెనీ ఉద్దేశ్యం. అయితే, రుణం అందకపోవటంతో కంపెనీ పనులను కూడా నిలిపేసింది. ఇదంతా ఇలా వుండగానే 2016లో ప్రభుత్వం ఎస్కో సంస్ధకు నోటీసు ఇచ్చింది. పనులు మొదలు పెట్టని కారణంగా భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పమంటూ. కంపెనీ కూడా జరిగిన విషయాలన్నింటినీ వివరించింది. అయితే, కంపెనీ సమాధానాన్ని పట్టిచుకోని ప్రభుత్వం భూమి మొత్తాన్ని వెంకటగిరి మున్సిపాలిటీకి అప్పగించేసింది.  ఆ విషయంపైనే కంపెనీ కోర్టును ఆశ్రయించింది.

రెండు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. కంపెనీలకు భూములను కేటాయిస్తున్న ప్రభుత్వం రెవిన్యూ రికార్డుల్లో మాత్రం ఎందుకు ఆ విషయాన్ని రికార్డు చేయటం లేదని తీవ్రంగా ప్రశ్నించారు. భూ రికార్డులను మార్చటానికి అధాకారులు కంపెనీలను వేధిస్తున్నట్లు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతున్నారు కానీ స్వదేశంలో కంపెనీల గురించి మాత్రం పట్టించుకోరా అంటూ నిలదీశారు. పెట్టుబడులు ఊరికే వస్తాయా? అందుకు అవసరమైన వాతావరణం కల్పించవద్దా ? అంటూ మండిపడ్డారు. వాతావరణం ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios