ఎన్ కౌంటర్ పై దాఖలైన కేసుభూటకపు ఎన్ కౌంటర్ అంటున్న హక్కుల సంఘాలుబుధవారానికి కేసు వాయిదా
రెండు రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై అన్నీ వర్గాల్లోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన సోమవారం నాడు పెద్దగా స్పందించని వామపక్షాలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు మంగళ, బుధవారాల నుండి బాగా హడావుడి చేస్తున్నారు. జరిగింది భూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో కేసులు దాఖలు అవుతున్నాయి.
సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ ఘటన వెలుగు చూసిన వెంటనే హక్కుల సంఘం నేతలు వరవరరావు తదితరులు మాత్రం అది భూటకపు ఎన్ కౌంటర్ అనే ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మల్కనగిరి ఎస్ పి కార్యాలయం ముందు హక్కుల సంఘం నేతలు, మృతుల తరపు కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోోళనకు దిగారు
అంతే కాకుండా జరిగినట్లు చెబుతున్న ఎన్ కౌంటర్ పై తమకు అనేక సందేహాలు ఉన్నట్లు బల్లకొట్టి మరీ వాదిస్తున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందలేదని, మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు.
మావోయిస్టుల్లోని కొందరిని లొంగదీసుకున్న పోలీసులు ప్లీనరీ జరుగుతున్న సమయంలో మిగిలిన మావోయిస్టు నేతలకు మత్తుమందు పెట్టించి ఉంటారని హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అందులోనూ ఏపి పోలీసులు ఒడిస్సాకు వెళ్ళి కాల్పులు జరిపారని అంటున్నారు.
ఒక రాష్ట్ర పోలీసులకు మరో రాష్ట్రానికి వెళ్ళి కాల్పులు జరిపే హక్కు లేదని వాదిస్తున్నారు. ఇదే అంశంపై న్యాయస్ధానంలో పిటీషన్ కూడా దాఖలు చేసారు. బుధవారం పిటీషన్ ను విచారించిన న్యాయస్ధానం పోలీసులు తమ పరిధి దాటి ఏ విధంగా వెళతారంటూ నిలదీసింది. ఇదే విషయమై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదావేసింది.
అదే సమయంలో న్యాయస్ధానం ఆదేశాల మేరకు మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరచాలని, పోస్టు మార్టమ్ జరిపేముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలనే నిబంధనలను కూడా హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
