విజయవాడ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 3,52,579 వుండగా అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులుగా వుంది. 

ఈ నేపథ్యంలోనే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని... వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. 

read more  తెలంగాణలో భారీ వర్షాలు...హైదరాబాద్ కు పొంచివున్న ప్రమాదం

మరోవైపు ఈ వర్షాల కారణంగా కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది. గండికోట జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 16.5 టీఎంసీలుగా వుంది. అంతకంతకు నీటి నిల్వ పెరుగుతుండటంతో ముంపు గ్రామమైన తాళ్ల పొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నీట మునిగింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరో తెలుగు రాష్ట్రమయిన తెలంగాణలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద  కొనసాగుతోంది.దీంతో మొత్తం 20 క్రస్టుగేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10గేట్లు 15ఫీట్ల మేర, 10గేట్లు 10ఫీట్ల మేర ఎత్తారు అధికారులు.  ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో కూడా 4,10,978 క్యూసెక్కులుగా వుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ312.0450 టీఎంసీలుగా వుంది.