హైదరాబాద్: తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాల ముప్పు పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా భారీ వర్షాలు కురుస్తాయన్న ప్రకటన రాష్ట్ర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

రాష్ట్రంలో సోమ, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే ఆదివారం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని... అక్కడక్కడ మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని తీవ్రత ఎక్కువగా గ్రేటర్‌ పరిధిలోనే ఉందని అన్నారు. కాబట్టి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... నగరవాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. 

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.