అమరావతి: సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  తీవ్రవాయుగుండం పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య  కాకినాడకు అతి సమీపంలో తీరం దాటినట్లు విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో వీస్తున్న గాలులు, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు.

ఐఎండి ప్రకటన ప్రకారం రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుండగా  మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్నారు. 

శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. 

read more  విశాఖ తీరానికి కొట్టుకొచ్చినర బంగ్లాదేశ్ నౌక

పశ్చిమగోదావరి జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఇవాళ (మంగళవారం) ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. 

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని...ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని.. వర్షాలు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ, పోలీస్ వ్యవస్థలు సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలన్నారు. 

భారీ వర్షాల కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని మంత్రి సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. 

అలాగే తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కృష్ణా , తూర్పు,పశ్చిమ గోదావరి కలెక్టర్ల, ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి అనిల్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.