విశాఖపట్టణం:   బలమైన గాలులతో విశాఖపట్టణం తీరానికి భారీ నౌక కొట్టుకువచ్చింది.  బంగ్లాదేశ్ కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు విశాఖ తెన్నేటీ పార్క్ తీరానికి కొట్టుకువచ్చింది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడ వీస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా ఓ నౌక  మంగళవారం నాడు విశాఖ తీరానికి కొట్టుకువచ్చింది.

80 మీటర్ల పొడవున్న నౌక మంగళవారం నాడు తెల్లవారుజామున విశాఖ తీరంలోని ఇసుక మద్య చిక్కుకొంది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.నౌక యాంకర్లు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన విశాఖకు చెందిన షిప్ యార్డు సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారు.

నౌకను ఇసుక తిన్నెల నుండి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ తీరానికి బంగ్లాదేశ్ కు చెందిన నౌక కొట్టుకువచ్చిందనే విషయం తెలిసిన స్థానికులు ఇక్కడికి చేరుకొంటున్నారు. ఈ నౌకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గుంపులు గుంపులుగా ఇక్కడికి వస్తున్న వారిని పోలీసులు అడ్డుకొంటున్నారు.