పోలవరం ప్రాజెక్ట్‌పై త్వరలో కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం : జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పోలవరానికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేయబోతోందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కోసం త్వరలో రూ.12 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తుల నీటి నిల్వ చేసుకునేందుకు వీలు కలుగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు. తొలి దశ పోలవరం నిర్మాణం, డయాఫ్రం వాల్ మరమ్మత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12,911 కోట్లను ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుందని జీవీఎల్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో వున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు.
ALso Read: పోలవరం నిర్మాణం .. ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ కీలక వ్యాఖ్యలు
ఏపీకి మోడీ సర్కార్ పెద్ద మొత్తంలో నిధులు ఇస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో రూ.55 వేల కోట్ల నరేగా నిధులు విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ రెవెన్యూ లోటు కింద రూ.10 వేల కోట్లు ఇచ్చారని.. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజ్ రూపంలో రూ.10 వేల కోట్లను విడుదల చేశారని జీవీఎల్ తెలిపారు. కేంద్రం నిధులతోనే వైసీపీ తన పథకాలను అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అప్పులపై పరిమితి విధించినా.. ఏపీకి కొంత వెసులుబాటు కల్పించిందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.