వచ్చే ఎన్నికల్లో బావమరది, సినీనటుడు మహేష్ ను పిలిచేది లేదని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంత కష్టమైనా తాను మాత్రం తన బావమరది మహేష్ ను ప్రచారానికి రమ్మంటూ పిలవనని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ఓ మీడియాతో మట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో కూడా మహేష్ తన కోసం ప్రచారానికి రాని విషయాన్ని గుర్తు చేశారు. పోయిన ఎన్నికల్లో మహేష్ రాకపోయినా తాను గెలిచిన విషయాన్ని కూడా ఎంపి గుర్తు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో మహేష్ తన ప్రచారానికి రాకపోవటమే మంచిదైందని కూడా అన్నారు.

మహేష్ సోదరిని గల్లా జయదేవ్ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో తన గెలుపు కోసం మహేష్ చేత ప్రచారం చేయించుకోవాలని జయదేవ్ చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, మహేష్ అంగీకరించలేదు. చివరకు జయదేవ్ కు ఓటు వేయాలంటూ మహేష్ తో కుటుంబసభ్యులు ట్వట్టర్ ద్వారా ఓటర్లకు ఓ అప్పీల్ చేయించుకుని తృప్తి పడ్డారు. తాను స్వయంగా అడిగినా మహేష్ ప్రచారం చేయకపోవటంతో జయదేవ్ కు బాగా ఆగ్రహం వచ్చి ఉంటుంది. అయితే, మహేష్ రాకపోయినా జయదేవ్ గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మహేష్ అవసరం తనకు లేదని అనుకుని ఉండవచ్చు. ఆ విషయాన్నే జయదేవ్ తన తాజా ఇంటర్యూలో స్పష్టం చేశారు.