చంద్రబాబు పరిస్ధితేంటి ?

First Published 18, Dec 2017, 1:56 PM IST
Gujarat results are more problematic to Naidu rather than any other party
Highlights
  • గుజరాత్ ఫలితాలు ఒకవిధంగా తెలుగుదేశంపార్టీకి నిరాశను కలిగించేట్లుగానే ఉన్నాయి.

గుజరాత్ ఫలితాలు ఒకవిధంగా తెలుగుదేశంపార్టీకి నిరాశను కలిగించేట్లుగానే ఉన్నాయి. ఇప్పటికైతే స్పష్టమైన ఆధిక్యతలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని తేలిపోయింది. కాకపోతే పోయిన ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా తగ్గినా అధికారం మాత్రం నిలుపుకుంది. ఎక్కడో గుజరాత్ ఫలితాలు ఏపి వైపు ఏ విధంగా ప్రభావం చూపుతుంది? అంటే, ఏపిలో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశంపార్టీ-భాజపాల మధ్య పరిస్ధితి ఏమంతా బావోలేదన్న విషయం బహిరంగ రహస్యమే.

అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుపై లెక్కలడుగుతూ చంద్రబాబునాయుడును ముప్పు తిప్పలు పెడుతోంది కేంద్రం. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనూ పెద్దగా నిధులిచ్చింది లేదు. ఇక, ప్రత్యేకహోదా, విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ అంశమైతే ఎప్పుడో గాలికి కొట్టుకుపోయింది. ఇలా అనేక అంశాల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సహకరించకున్నా చంద్రబాబు గట్టిగా నిలదీయలేని స్ధితిలో ఉన్నారన్నది వాస్తవం. బహుశా ‘ఓటుకునోటు’ దెబ్బకు చంద్రబాబు కుదేలైపోయారు. అంతెందుకు దాదపు రెండేళ్ళుగా ప్రధానమంత్రి అపాయిట్మెంటే సాధించలేకున్నారంటేనే చంద్రబాబు ధీనస్ధితి ఏంటో అర్ధమైపోతోంది.

ఇటువంటి నేపధ్యంలోనే గుజరాత్ ఎన్నికలు వచ్చాయి. అప్పటి పరిస్దితి ప్రకారం గుజరాత్ లో భాజపాకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. అందులో భాగంగానే టిడిపి నేతలు కూడా భాజపాకు గుజరాత్ లో దెబ్బ పడాలనే ఆశించింది వాస్తవం. ఎందుకంటే, అన్నీ విషయాల్లోనూ చంద్రబాబును, ఏపిని దూరం పెడుతున్న నరేంద్రమోడి వైఖరిలో మార్పు వస్తుందని కాస్త తగ్గుతారని టిడిపి నేతలు ఆశించారు.

కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటి తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. దాంతో టిడిపి సంబర పడుంటుంది. అయితే, 11.30 గంటల ప్రాంతంలో తిరిగి భాజపా పుంజుకోవటంతో టిడిపి ఢీలాపడిపోయింది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ విజయాలతో మోడి మొహంలో విజయగర్వం స్పష్టంగా కనబడుతోంది. మొన్నటి మోడికి ఈరోజు మోడికి తేడా స్పష్టంగా తెలుస్తోంది. దాంతో టిడిపిలో అయోమయం నెలకొంది.

మామూలుగానే మోడి చంద్రబాబును ఏపిని పట్టించుకోవం లేదు. దానికితోడు రెండు రాష్ట్రాల్లోను సాధించిన విజయంతో మోడికి పట్టపగ్గాలుండవన్న విషయం స్పష్టం. మోడి ఎంత బలోపేతమైతే చంద్రబాబుకు వ్యక్తిగతంగాను, హోలు మొత్తం మీద ఏపికి అంత నష్టమని తేలిపోయింది.  మరి, దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎవరిమీద పడుతుందో వేచి చూడాల్సిందే.

loader