నిరుద్యోగ భృతి కావాలా ? ఇవే నిబంధనలు

First Published 25, Dec 2017, 1:57 PM IST
guidelines to get stipend for unemployed youth
Highlights
  • అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ నిబంధనలు పెట్టినట్లుగానే నిరుద్యోగ భృతి విషయంలో కూడా పలు నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ నిబంధనలు పెట్టినట్లుగానే నిరుద్యోగ భృతి విషయంలో కూడా పలు నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వచ్చే జనవరి నుండి నిరుద్యోగభృతి అమలు చేయాలని చంద్రబాబునాయుడు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ఈమధ్యనే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రభుత్వం కూడా భృతిని వర్తింప చేయటంలో నిబంధనలను సిద్దం చేసి డ్రాఫ్టును విడుదల చేసింది. భృతి అందుకోలవాలనుకున్న వారికి అనేక నిబంధనలను పెట్టింది.

అవేంటో ఒకసారి చూస్తే మీకు ఏ మేరకు అర్హత ఉందో అర్ధమైపోతుంది. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ ప్రకారం దరఖాస్తుదారుల్లో ఎవరైతే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారో వారికే ప్రాధాన్యం. ఒక వేళ ఒకే వయస్సుతో అనేక మందుంటే వారిలో అవసరమైన విద్యార్హత ఎవరు పొందారో వారినే ముందు పరిగణలోకి తీసుకుంటారు.

ఒకవేళ వయస్సు, విద్యార్హతలు కూడా ఒకే రకంగా ఉండి, ఎటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇక్కడ కూడా మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యోగం రాని వారిని సీనియర్లుగా గుర్తిస్తారు. మరోవైపు ఎవరైనా దరఖాస్తు దారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉంటే అటువంటి వారిని నిరుద్యోగభృతికి అర్హులుగా పరిగణిస్తారు. అదికూడా రాష్ట్రంలో జన్మించిన వారికే.

ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డులు ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేయాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుని పేరు ఉపాధి కల్పన కేంద్రంలో నమోదయి, ఆన్‌లైన్‌లో రిజిస్టరై ఉండాలి. కనీసం 10+2 విద్యార్హత ఉండాలి. టెక్నికల్‌ అయితే కనీసం ఐటిఐ పాసై ఉండాలి. 18-35 ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భృతి పేద కుటుంబాల వారికే వర్తింప చేస్తారు.

ఒక కుటుంబంలో ఒకరికే ఇస్తారు. సంబంధిత కుటుంబం రేషన్‌ తీసుకుంటూ ఉండాలి. కారు ఉన్నా, స్వయం ఉపాధి పథకాల్లోగాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కానీ ఇప్పటికే లబ్ధిదారులయితే అటువంటి వారు అనర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఎక్కడైనా పని చేస్తున్నా, ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించినా క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కున్నా అర్హత లేదు. దరఖాస్తు చేసుకున్న వారు నైపుణ్యా భివృద్ధిలో ముందు శిక్షణ పొందాలి. మొత్తం ఆన్‌లైన్‌ లోనే ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి ప్రభుత్వం ప్రకటంచిన మార్గదర్శకాలు. వీటి ప్రకారం ఎంతమంది అర్హులవుతారో ఎవరికి వారుగా అంచనాకు రావచ్చు.

 

loader