అలాగే కాపులకు, బలిజలకు మధ్య చిచ్చు రేగటంలో కూడా చంద్రబాబు పాత్రను కొందరు నేతలు అనుమానిస్తున్నారు.

చంద్రబాబు వ్యవహారశైలిపై కాపులు మండిపడుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు స్పష్టంగా కనబడుతోందని పలువురు నేతలు అనుమానిస్తున్నారు. ముద్రగడ మీద కోపంతో మొత్తం కాపులపైనే తన ఆగ్రహాన్ని చూపుతున్నట్లుగా వారు భావిస్తున్నారు.

చిరంజీవి 150వ సినిమా ‘ఖైది’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అడిగిన చోట ప్రభుత్వం అనుమతి నిరాకరించటం ఇందులో భాగమేనని కాపు నేతలు పలువురు ఆరోపిస్తున్నారు.

అలాగే కాపులకు, బలిజలకు మధ్య చిచ్చు రేగటంలో కూడా చంద్రబాబు పాత్రను కొందరు నేతలు అనుమానిస్తున్నారు. టిడిపికి కాపు సామాజిక వర్గం దూరమవుతోందన్న అనుమానంతోనే రాయలసీమలో బలిజలను వేరు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ముద్రగడ కూడా ఇదే విషయంపై చంద్రబాబు మీద ఆరోపణలు చేయటాన్ని పలువురు కాపు నేతలు ప్రస్తావిస్తున్నారు. హటాత్తుగా బలిజ నేతలు తాము కాపులతో కలిసి ఉద్యమాల్లో పాల్గొనేది లేదని చెప్పటంలో వారి వెనకుండి నడిపిస్తున్నది చంద్రబాబేనంటూ ముద్రగడ ఆరోపించిన సంగతి తెలిసిందే.

2014 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కాపుల పట్ల ఏ విధంగా వ్యవహరించారో ఇపుడు చంద్రబాబు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

అప్పట్లో కాపుల అండలేకున్నా ఎన్నికల్లో గెలవగలనని జగన్ అనుకునే చివరకు ప్రతిపక్షంలో కూర్చున్నారని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు వ్యవహారశైలి వల్ల రేపటి ఎన్నికల్లో కాపులు ఎటువంటి పరిస్ధితుల్లోనూ టడిపికి మద్దతుగా నిలిచేది లేదని కాపు యువశక్తి నేతలు తెగేసి చెబుతున్నారు.

ఆ విషయాన్ని పసిగట్టిన తర్వాతే చంద్రబాబు రాయలసీమలో బలిజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కాపు నేతలు అనుమానిస్తున్నారు.

జనసేన వ్యవస్ధాపకుడు పవన్ కల్యాణ కూడా ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని పలువురు కాపు నేతలంటున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు వైఖరిపై చర్చించేందుకు త్వరలో సమావేశం అవ్వాలని కాపు సామాజిక వర్గంలోని కొందరు నేతలు యోచిస్తుండటం గమనార్హం.