మంత్రికి షాక్: రూ. 50 లక్షల జరిమానా విధించిన ఏపి సర్కార్

First Published 14, Dec 2017, 10:44 AM IST
Govt imposes Rs 50 Lakhs fine on narayana college
Highlights
  •  మంత్రి కాలేజీకే ప్రభుత్వం భారీ జరిమానా విధించింది

తన కాలేజీకే ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తుందని మంత్రి అనుకుని ఉండరు. అదికూడా జరిమానా విధించింది స్వయానా వియ్యంకుడి శాఖే కావటంతో మంత్రి నారాయణకు పెద్ద షాకే తగిలింది. అదే సమయంలో వియ్యంకుడికే భారీ జరిమానా విధించాల్సి వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు కలలో కూడా అనుకుని ఉండరు. రూ. 50 లక్షల జరిమానా విధించాల్సి వచ్చినందుకు పాపం గంటా ఎంత బాధపడిపోయుంటారో? ఇంతకీ విషయం ఏంటంటే, మంత్రులు గంటా శ్రీనివసరావు, పి. నారాయణ వియ్యంకులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో నారాయణకు నారాయణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్దలున్నాయి.

నారాయణ సంస్ధల్లో చదువుతున్న విద్యార్ధుల్లో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్ధి సంఘాల ఆరోపణల ప్రకారమే సుమారు గడచిన మూడున్నరేళ్ళల్లో 60 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారట. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనబడలేదు. విద్యశాఖ కూడా చోద్యం చూస్తోంది. ఎందుకంటే, వియ్యంకుడు గంటా స్వయంగా విద్యాశాఖ మంత్రి కావటమే కారణం.

ప్రభుత్వంలో చలనం లేకపోయినా, విద్యాశాఖ చోద్యం చూస్తున్నా ఆత్మహత్యలైతే ఆగలేదు. దాంతో తల్లి, దండ్రులు, విద్యాసంఘాల్లో ఆందోళన పెరిగిపోయింది. చివరకు నారాయణ విద్యాసంస్ధలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసే స్ధాయికి చేరింది  పరిస్దితి. దాంతో చంద్రబాబునాయుడు హటత్తుగా మేల్కొని చాలా హడావుడి చేశారు. విద్యాసంస్దలన్నింటికీ హోల్ సేల్ గా హెచ్చరికలు కూడా చేసారు. ఎందుకంటే, ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా?

స్వయంగా చంద్రబాబే పూనుకోవటంతో గంటా కూడా మొక్కుబడిగా అయినా కదాలల్సి వచ్చింది. అందుకని ఏవో కొన్ని కళాశాలలతో పాటు హాస్టళ్ళను కూడా తనిఖీలు చేసారు.  ఇదిలావుండగానే తాజాగా తిరుపతిలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్ధి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. సరే, ఘటనపై విచారణకు ఆదేశిస్తూనే కళాశాలకు రూ. 50 లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానా విధించకపోతే కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని గంటా చెప్పారు. జరిమానా మొత్తంలో కొంత సొమ్మును విద్యార్ధి కుటుంబానికి చెల్లించే అంశం పరిశీలిస్తామని గంటా చెప్పారు లేండి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

loader