రాజధాని రైతులకు యూజర్ ఛార్జీల పేరుతో వాతలు పెట్టటానికి ప్రభుత్వం సిద్దపడింది. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో రైతుల నుండి సుమారు 35 వేల ఎకరాలు సమీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పచ్చని పంట పొలాలను రాజధానికి ఇచ్చిన కారణంగా రైతులకు ప్లాట్లను ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అదికూడా అన్నీ రకాలుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయిస్తామని చెప్పారు. పైగా మౌళిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు, మంచినీటి సౌకర్యం తదితరాలు ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పటు చేస్తామని కూడా ఎన్నోమార్లు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది.

అయితే, తాజాగా చెబుతున్నదేమిటంటే, మౌళిక సదుపాయాల ఖర్చు రైతులే భరించాలట. సదుపాయాలకయ్యే మొత్తం ఖర్చులో రైతులు 51 శాతం భరించాలని ప్రభుత్వం ఇపుడు స్పష్టం చేసింది. అందుకోనం 29 గ్రామాలను 13 జోన్లుగా విభజించింది. 16,220 ఎకాల విస్తీర్ణంలో మౌళిక సదుపాయాల కల్పనకు సుమారు రూ. 13,157 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది సిఆర్డీఏ. అంటే ఈ మొత్తంలో 51 శాతం రైతులే అంటే ఎన్నికోట్లవుతుందో?  ఈ మొత్తాన్ని రైతులు, స్ధానికుల నుండి యూజర్ చార్జీలు, అభివృద్ధి చార్జీలు, ఇతర పన్నుల రూపంలో వసూలు చేస్తుంది సిఆర్డీఏ.

రైతుల నుండి వసూలు చేసిన చార్జీలన్నింటినీ ప్రైవేటు డెవలపర్స్ చేతిలో పెట్టి మొత్తం భూమిని డెవలప్మెంట్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. సరే, ప్రైవేటు డెవలపర్లంటే ఎటుతిరిగీ ప్రభుత్వంలోని ముఖ్యులకు కావాల్సిన వారే ఉంటారనటంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. మొత్తం పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ, బిఎస్ఆర్ ఇన్ ఫ్రా, ఎన్సీసీ లు దక్కించుకున్నాయి. అంటే జరుగుతున్న తంతు చూస్తుంటే, భూములు తీసుకునేముందు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ఒకటి. ఇపుడు అదే భూములను డెవలప్మెంట్  పేరుతో చెబుతున్నదొకటి. ప్రభుత్వ నిజస్వరూపం ఇపుడే బయటపడుతోంన్నమాట. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో ?