నిరుద్యోగులంటే ప్రభుత్వానికి ఎంతటి చిన్న చూపో అర్ధమైపోతోంది.  శనివారం మధ్యాహ్నం నుండి టెట్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చాలా కాలం క్రితమే ప్రకటించింది ప్రభుత్వం. ఈరోజు కోసం లక్షలాదిమంది నిరుద్యోగులు ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. కానీ చివరకు ఏమైంది?

మధ్యాహ్నం వరకూ  కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏపీ వెబ్ సైట్లో హాల్ టిక్కెట్లు అపలోడ్ కాలేదు.  దాంతో విద్యాశాఖ వైఫల్యం మరోసారి బయటపడింది. మొదటి నుంచి ఏపీ టెట్ పరీక్షపై విద్యాశాఖలో ఇదే నిర్లక్ష్యం కనబడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వరకూ ఆన్ లైన్లో ఏపీ టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.  హాల్ టిక్కెట్లలోనే అభ్యర్థుల పరీక్షా కేంద్రాలు, పరీక్షా తేదీల వివరాలుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆన్ లైన్ పరీక్ష నిర్వహణను ఓ ప్రైవేటు సంస్దకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు తీసుకున్న ప్రవేటు సంస్థకు పరీక్షా కేంద్రాల ఎంపికలో సమస్యలు తలెత్తాయి. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 175 వరకూ పరీక్షా కేంద్రాలున్నాయి. ఏపీ టెట్ పేపర్ 1, 2, 3 లకు కలిపి మొత్తంగా 4,46,833 మంది దరఖాస్తు చేశారు. చివరి దశలో అధికారులు పరీక్షాకేంద్రాలు సరిపోవని నిర్థారించారు. ముందునుంచే సన్నద్ధంగా ఉండాల్సిన అధికారులు చివరి నిముషం వరకూ ఏమి చేస్తున్నారో అర్దం కావటం లేదు.

తెలంగాణా రాష్ట్ర డీఎస్సీ, ఏపీ టెట్ పరీక్షలు ఒకే సమయంలో జరుగుతుండటంతో ఇరు రాష్టాల అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.  20శాతం కోటాలో ఉభయ రాష్టాల అభ్యర్థులు ఈ పరీక్షలు రాసేందుకు అవకాశముందన్న విషయాన్ని అధికారులు విస్మరించారు. ఏపీ టెట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉపాధ్యాయ శిక్షణార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాల్ టిక్కెట్ల డౌన్ లోడు చేసుకోవాల్సిన సమయంలో సమీక్షలేమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు.