స్త్రీ నిధి ద్వారా మహిళలకు రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రికవరీ యాప్‌తో డిజిటల్ పద్ధతిలో మానిటరింగ్ చేపట్టనున్న ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 నాటికి స్త్రీ నిధి ద్వారా మహిళలకు రూ.5,700 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. విజయవాడలో జరిగిన ఈ సంవత్సరం తొలి త్రైమాసిక సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డిజిటల్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఐఎఫ్ (సామూహిక వనరుల నిధి) రుణాలను పూర్తిగా స్త్రీ నిధి ద్వారానే అందించాలని నిర్ణయించారు.

రూ.50 వేలు నుండి రూ.లక్ష వరకు…

అర్హత కలిగిన డ్వాక్రా మహిళలకు రూ.50 వేలు నుండి రూ.లక్ష వరకు అవసరానికి అనుగుణంగా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీ నిధి నిధులను వేరే ప్రయోజనాలకోసం ఉపయోగించినట్టు గుర్తించినట్టు వెల్లడించారు. ఇలాంటి నిధుల దుర్వినియోగం పేద మహిళలకు తీవ్రంగా నష్టం చేకూర్చుతుందని మంత్రి స్పష్టం చేశారు. బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.

పూర్తిగా డిజిటల్ పద్ధతిలో…

స్థానిక స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకు జరిగిన అక్రమాలను గుర్తించి, వాటికి సంబంధించిన అధికారులపై మండల లేదా జిల్లా స్థాయిలో కేసులు నమోదు చేయాలని సూచించారు. స్త్రీ నిధి కార్యకలాపాలను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నడిపేందుకు రికవరీ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు తమ రుణ చెల్లింపుల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.

స్త్రీ నిధి పనితీరుపై..

ఇకపై సీఐఎఫ్ రుణాల మంజూరు, రికవరీ తదితర పర్యవేక్షణలను పూర్తిగా స్త్రీ నిధి ద్వారా నిర్వహించనున్నారు. రుణాల మంజూరుకు వచ్చిన దరఖాస్తులను 48 గంటల్లోనే పరిష్కరించాలని సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ తెలిపారు. ప్రతి 15 రోజులకు స్త్రీ నిధి పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామస్థాయిలోని ప్రతి సంఘం ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.