ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. 5 ఏళ్లు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి చేసిన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఒకే సచివాలయంలో 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి కానుంది. ఇకపై సొంత మండలంలో ఉద్యోగిని నియమించకూడదని స్పష్టం చేసింది. బదిలీ అయిన వారి వివరాలను జులై 10లోపు హెచ్‌ఆర్‌ఎంఎస్ (HRMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగుల సంఖ్య అవసరానికి మించి ఉంటే, కొందరిని అక్కడే కొనసాగించే అవకాశం ఉంది. ఈ విషయంలో తుది నిర్ణయం కలెక్టర్లదే. మొత్తం బదిలీ ప్రక్రియను జూన్ 30లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు ప్రత్యేక శ్రేణిలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. వీరిలో శారీరకంగా వికలాంగులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పైగా పనిచేసినవారు, కారుణ్య నియామకంలో ఉద్యోగాలు పొందినవారు ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే, వీలైనంత వరకు దగ్గర ప్రాంతాలకు బదిలీ చేసేలా చూడాలని చెప్పింది. వీరి బదిలీలను 'రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లు'గా పరిగణించి ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వనుంది.
ఇటీవలి జనాభా గణాంకాల ఆధారంగా సచివాలయాలను 'ఏ', 'బీ', 'సీ' కేటగిరీలుగా విభజించారు. 'ఏ' కేటగిరీలో 6 మంది, 'బీ'లో 7 మంది, 'సీ'లో 8 మంది వరకు ఉద్యోగులను నియమించాలన్నది తాజా మార్గదర్శకం. ఈ సంఖ్యలకు అనుగుణంగా హేతుబద్ధీకరణ చేస్తారు.బదిలీల అనంతరం మిగిలిన ఉద్యోగులను అవసరమైన ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపే అవకాశం ఉంది.
