ఏపీ రైతులకు శుభవార్త.. జూన్ 20న రూ.7 వేలతో అన్నదాత సుఖీభవ ప్రారంభం, పీఎం కిసాన్‌తో కలిపి మూడుసార్లుగా డబ్బులు విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల 20న ప్రారంభమవుతోంది. ఈ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7 వేల ఆర్థిక సాయం జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో రూ.2,000 కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఇవ్వగా, రాష్ట్రం నుంచి అదనంగా రూ.5,000 చెల్లించనుంది. మొత్తం సాయం మూడు విడతలుగా అందనుంది.
సన్న రకపు బియ్యం పంటలకు..
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరులో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన పరికరాలు ఇవ్వలేదని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చి వెంటనే వాటిని అందజేస్తోందన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సన్న రకపు బియ్యం పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
24 గంటల్లో చెల్లింపులు…
కౌలు రైతులు బ్యాంకుల్లో సమస్యలు ఎదుర్కొనకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు 24 గంటల్లో చెల్లింపులు జరుపుతామని చెప్పారు. అలాగే, కోకో, పామాయిల్ పంటలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని, కోకో గింజల కొనుగోలుకు ప్రత్యేక విధానం రూపొందిస్తామని వివరించారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి చెప్పారు. ITC, JPI సంస్థలతో కలిపి 20 వేల మిలియన్ కిలోల కొనుగోలుకు అంగీకారం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ద్వారా 75 మిలియన్ కిలోల కొనుగోలు జరుగుతుందని వెల్లడించారు. గ్రేడ్-ఏ రకం పొగాకు క్వింటాలుకు రూ.12,000, గ్రేడ్-బీకి రూ.5,400 ధరగా నిర్ణయించినట్టు చెప్పారు.
పొగాకు కొనుగోలుకు చర్యలు..
రైతుల పంటలకు భద్రత కల్పించేందుకు పొగాకు పంటపై బీమా పథకం మళ్లీ ప్రారంభించామని, ప్రమాద బీమా మొత్తాన్ని రూ.7 లక్షల వరకు పెంచామని తెలిపారు. చివరిదాకా పొగాకు కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.