గుంటూరు: తాజాగా రాష్ట్రంలో జరిగిన పరిస్ధితులు చూసిన తరువాత గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టిడిపి నాయకుల వరుస అరెస్టులపై తన స్వగృహంలో గోరంట్ల మీడియా సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...''ఒక్కప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో ప్రముఖ సోషలిస్టు జయప్రకాశ్ నారాయణను అరెస్టు చేసి జైలుకు పంపిన సమయంలో ఆయన వినాశానికే విపరీతిబుద్ది అని అన్నారు. అలాగే తమిళనాడులో కంచికామక్షి పీఠాధిపతిని హత్యకేసులో జైలుకు పంపిన సమయంలో ఆయన కూడా వినాశానికే విపరీత బుద్దిదని అన్నారని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ చర్యలకు వర్తిస్తాయని భావిస్తున్నాను'' అని అన్నారు.  

''తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు స్టేషన్లు చుట్టు తిప్పడం వంటివి చేస్తూ ఆటవిక ఆరాచాకాలకు నాంది పలికింది ఈ ప్రభుత్వం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్షాల గొంతునొక్కడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి శూన్యం. ఎక్కడ చూసినా అరాచకాలకు, అవినీతికి, అక్రమాలకు, దోపిడిలకు కేంద్ర బిందువుగా ఈ ప్రభుత్వం మారిపోయింది. ఇసుక, మైనింగ్, లిక్కర్, మాఫీయాకు అడ్డాగా మారిపోయింది. అలాగే ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది'' అన్నారు.  

read more  లోకేష్ అనంతపురం పర్యటన సందర్భంగా ఉద్రిక్తత

''సిమెంట్ అమ్మకాల్లో కేవలం రూ.100కు రూ.30 కమిషన్ తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం. విద్యుత్తు శక్తి రేట్లు పెంచారు. సరఫరా క్వాలిటి లేకుండా పోయింది. పెట్రోల్, డిజీల్ రేట్లు పెంచారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులకు పని లేక పస్తులు ఉంటున్నారు.ఇలాంటి పరిస్థితులల్లో అసెంబ్లీ మాట్లాడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదన్నారు. శాసన సభను కేవలం రెండు రోజులు మాత్రమే జరపాలని ప్రయత్నం చేస్తున్నారు'' అని అన్నారు. 

''కరోనా పెరిగిపోవడానికి కారణం  వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే. అనేక సాంఘిక సంక్షేమ పథకాలు ఆయా వర్గాలకు అందడం లేదు. రాజ్యాంగ బద్దంగా కేటాయించిన నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు షెడ్యూల్ కులాల వారికి అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తాత్కాలికంగా భయపడవచ్చు గానీ ఏదో ఒక్క రోజు బుద్ది చెబుతారు'' అని గోరంట్ల హెచ్చరించారు.