అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించేందుకు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాడిపత్రికి వెళ్లారు. మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి ఆయన తనయుడు పవన్ రెడ్డిలను వారి నివాసంలోనే కలిసిన లోకేష్ ధైర్యంగా వుండాలని సూచించారు. జేసి కుటుంబానికి టిడిపి ఎల్లపుడూ అండగా వుంటుందని హామీ ఇచ్చారు. 

అయితే లోకేష్ పర్యటన సందర్భంగా అనంతపురం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. లోకేష్ పర్యటన సందర్భంగా గుత్తి నుండి తాడిపత్రికి బయలుదేరిన టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గుత్తి మండలంలోని కొత్తపేట వద్ద టీడీపీ కార్యర్తల వాహనాలను అడ్డుకోవడంతో వారు వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అయితే వెంటనే పోలీసులు స్పందించి ఆ వాహనాలను పక్కకు తీయించారు.

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కడప జైలుకు తరలించారు.

read more  అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పరామర్శించేందుకు లోకేష్ ఈ నెల 14న కడపకు వెళ్లారు.  కరోనా కారణంగా కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇవాళ జేసీ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో లోకేష్ అనంతపురం పట్టనానికి చేరుకొన్నారు.

నకిలీ పత్రాలతో వాహనాలు విక్రయించారనే కేసు వివరాలను జేసీ పవన్ కుమార్ రెడ్డి నుండి లోకేష్ అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోకేష్ జేసీ కుటుంబసభ్యులతో చర్చించారు. 

నకిలీ పత్రాలతో తమకు వాహనాలను విక్రయించారని నాగాలాండ్ డీజీపీకి తామే ఫిర్యాదు చేసినట్టుగా ఈ కేసు విషయమై జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈ నెల 13వ తేదీన మీడియాకు వివరించారు. తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు.