దసరా సందర్భంగా ముందుగానే పింఛను అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించిందిద. దసరా పండగ సందర్భంగా బుధవారం నుంచి పింఛను అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మంగళవారం నుంచి బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసి.. పింఛను దారులకు అందజేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కలెక్టర్లకు కూడా తెలియజేశారు. దీంతో వెంటనే అధికారులు బ్యాంకులకు ముందస్తు సమాచారం అందించారు.
సాధారణంగా పింఛన్లను ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తారు. అయితే.. దసరా పండగ సందర్భంగా ముందుగా పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 13జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు సమాచారం అందజేసినట్లు ఆమె తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45.68లక్షల మంది అర్హులు ఉన్నారని వారికి దసరాలోపు పింఛన్లు అందజేస్తామని మంత్రి చెప్పారు. పింఛన్ల పంపిణీ కి రూ.492కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పండగను ఆనందంగా జరుపుకోవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
