Asianet News TeluguAsianet News Telugu

గురు శిష్యుల చేతిలో ఏపీ పోలీస్ : ప్రక్షాళనపై జగన్ దృష్టి

ఇకపోతే స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ బదిలీకి తెలంగాణ ప్రభుత్వం సైతం ఆమోదముద్రవేసింది. మరో 15 రోజుల్లో ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మెుత్తానికి ఏపీ పోలీస్ శాఖ గురు శిష్యులకు అప్పగించారు వైయస్ జగన్. 
 

Gautam sawang  disciple Stephen Ravindra
Author
Amaravathi, First Published May 27, 2019, 9:36 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా అన్ని శాఖలపై వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అలర్ట్ చేస్తున్నారు. 

ఇప్పటికే వరుస సమీక్షలు చేసిన వైయస్ జగన్ పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించాల్సిన బ్యూరోక్రాట్ల వ్యవస్థలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి తరుణంలో వాటిపై జగన్ ప్రత్యేక దృష్టిసారించారు. 

ఇప్పటికే సీఎస్ గా తనకు నమ్మకస్తుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎంపిక చేశారు. అనంతరం డీజీపీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై సదాభిప్రాయం లేకపోవడంతోపాటు ఆయన ఇప్పటికే కేంద్ర సర్వీసులకు అప్లై కూడా చేసుకున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో దామోదర గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే పరోక్షంగా గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించినట్లు ఆదేశాలు ఇచ్చేశారు వైయస్ జగన్. ఆనాటి నుంచి నేటి వరకు వైయస్ జగన్ వ్యవహారాలన్నింటిని గౌతమ్ సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. 

గౌతమ్ సవాంగ్ సూచనలతోపాటు, వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసినప్పుడు గుర్తింపు, వైయస్ కుటుంబంతో అనుబంధం కారణంగా ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర కన్ఫమ్ అయిపోయారు.  

గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్రలపై వైయస్ జగన్ కు మంచి అభిప్రాయం ఉంది. ఆ అధికారులు ఇద్దరికీ తన తండ్రి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డితో సత్సమ సంబంధాలు ఉండటం స్టీఫెన్ రవీంద్ర సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గా పనిచేయడంతో వారిద్దరిని ఫైనల్ చేశారు జగన్. మెుత్తం ఏపీ పోలీస్ వ్యవస్థను వారిద్దరి చేతుల్లో పెట్టేశారు. 

అయితే దామోదర గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్రలు గురు శిష్యులు కావడం విశేషం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర ఒకప్పుడు గౌతమ్ సవాంగ్ వద్ద పనిచేసిన వ్యక్తే కావడం విశేషం. 

గౌతమ్ సవాంగ్ వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్నప్పుడు స్టీఫెన్ రవీంద్ర వరంగల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర తన ఉద్యోగాన్ని కూడా గౌతమ్ సవాంగ్ వద్దే ప్రారంభించడం విశేషం. 

అప్పటి డీజీపీ స్వర్ణజీత్ సేన్ ఉత్తర తెలంగాణలోని మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే బాధ్యతను డీఐజీ గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్రలకు అప్పగించారు. ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య గురు శిష్యుల బంధం ఏర్పడింది.  

గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్రలు మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. గ్రే హౌండ్స్ ను లీడ్ చేసిన స్టీఫెన్ రవీంద్రకు పలు సూచనలు సలహాలు అందిస్తూ గౌతమ్ సవాంగ్ స్టీఫెన్ రవీంద్రకు అండగా నిలిచారని పోలీస్ వర్గాల్లో తెలుస్తోంది. 

గౌతమ్ సవాంగ్ తన వద్ద పనిచేస్తున్నకాలంలో ఐపీఎస్ అధికారుల్లో ముఖ్యులైన ఉమేష్ చంద్ర, స్టీఫెన్ రవీంద్రలను అత్యుత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. రాష్ట్రవిభజన అనంతరం గౌతమ్ సవాంగ్ ఏపీ క్యాడర్ ను ఎంచుకోగా స్టీఫెన్ రవీంద్ర మాత్రం తెలంగాణ క్యాడర్ ను ఎంచుకున్నారు. దాంతో వారిద్ధరి మధ్య బంధం కాస్త దూరం అయ్యింది. 

ఏపీ డీజీపీగా వైయస్  జగన్ అవకాశం ఇస్తుండటంతో అంతే  కీలకమైన ఐబీ చీఫ్ ఎంపికపై కసరత్తు చేసిన గౌతమ్ సవాంగ్ స్టీఫెన్ రవీంద్ర పేరును తెరపైకి తేవడం జరిగింది. ఏ రాష్ట్ర శాంతి భద్రతలు, ముఖ్యమంత్రి భద్రతకు అయినా ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు అతి కీలకం. 

మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తుల వంటి వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని సీఎంకు తెలియజేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్ దే. ఈ నేపథ్యంలో అలాంటి వాటి పట్ల ప్రత్యేక దృష్టి సారించిన అధికారులలో ఒకరైన స్టీఫెన్ రవీంద్ర కరెక్ట్ అనుకున్నారు గౌతమ్ సవాంగ్ . అందులోనూ స్టీఫెన్ రవీంద్ర వైయస్ కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తి కావడంతో వారితో సత్సమసంబంధాలు కలిగి ఉండటంతో వైయస్ జగన్ అందుకు అంగీకారం తెలిపారు. 

ఇకపోతే స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ బదిలీకి తెలంగాణ ప్రభుత్వం సైతం ఆమోదముద్రవేసింది. మరో 15 రోజుల్లో ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మెుత్తానికి ఏపీ పోలీస్ శాఖ గురు శిష్యులకు అప్పగించారు వైయస్ జగన్. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర : లైన్ క్లియర్ చేసిన తెలంగాణ సర్కార్

జగన్ ను కలిసిన స్టీఫెన్ రవీంద్ర: ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆగయా..

ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?

Follow Us:
Download App:
  • android
  • ios