Asianet News TeluguAsianet News Telugu

క్షుద్రపూజల పేరుతో మహిళలకు వల.. వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్...

క్షుద్రపూజల పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యలతో తమ దగ్గరికి వచ్చే మహిళలను మాయమాటలతో మభ్యపెడుతున్న ఓ బాబా కోసం వెతుకుతున్నారు. 

gang Arrested luring women into prostitution in the name of occult worship in proddatur - bsb
Author
First Published Jun 20, 2023, 1:31 PM IST

ప్రొద్దుటూరు : ఆంధ్రప్రదేశ్ లోని  వైయస్సార్ జిల్లాలో క్షుద్ర పూజల పేరుతో మహిళలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టును ప్రొద్దుటూరు పోలీసులు రట్టు చేశారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఈ ముఠా లోనే ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా చేస్తున్న మోసాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారుడైన ఓ బాబా కోసం  పోలీసులు గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్ ఈ నేరానికి సంబంధించిన వివరాలను ఇలా వెల్లడించారు. 

మీడియాకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం…ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తిరుపతికి చెందిన ఓ మహిళ ఓ బాబాను ఆశ్రయించింది. ఆమె కూతుళ్ళకి వయసు మీరిపోతున్నా పెళ్లిళ్లు కావడం లేదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలకి బాబా దగ్గర పరిష్కారం దొరుకుతుందని ఆయన అతనిని ఆశ్రయించింది. ఆయన క్షుద్ర పూజలు చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని తెలిపాడు.

కర్నూలులో వీధి కుక్కల స్వైర విహారం.. 9యేళ్ల చిన్నారిపై మూడు కుక్కల దాడి..

బాబా గురించిన సమాచారం ఓ మహిళ తిరుపతి మహిళకు తెలిపింది. దీంతో ఆ ముఠా సభ్యులను ఆశ్రయించింది. ఫోన్లో వారితో మాట్లాడగా వారు ఆమెను కడపకు రమ్మని చెప్పారు. అలా కడపకు వచ్చిన ఆమెతో ముఠా సభ్యులు కొంతమంది కలిసి మాట్లాడారు.  అయితే ఆ సమయంలో వారు కొన్ని షరతులను ఆమెకు తెలిపారు.  ఆ షరతులకు ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత తిరిగి రెండు రోజుల క్రితం వారు ప్రొద్దుటూరులో మళ్లీ ఆమెతో సమావేశమయారు. 

ఈసారి తప్పనిసరిగా పూజలు చేస్తామని నమ్మించారు. ఈ క్రమంలో ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ముఠా సభ్యులు అమృత నగర్ లో ఉన్నారని తెలియడంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన వసారింటి నాగరాజు, వడ్డే వెంకటేష్, కంబగిరి రాముడు, కర్నూలు జిల్లాకు చెందిన మొట్టె కాంతమ్మ, మార్కె రాముడు, నంద్యాల జిల్లాకు చెందిన జిట్టా రవికుమార్, తిరుపతికి చెందిన పులిచెర్ల ప్రియా ఉన్నారు.

వీరందరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపించారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన సూత్రధారైన బాబా, మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీఐ యుగంధర్, ఎస్ఐ కృష్ణంరాజు నాయక్ లు సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడే మహిళలనే ఈ ముఠా టార్గెట్ చేస్తుందని.. ఇందుకోసం ముఠాలోని మహిళలు ఏజెంట్లుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ మహిళల ద్వారా అమాయకమైన మహిళలను ట్రాప్ చేసి క్షుద్ర పూజలకు అంగీకరించిన వారిని లొంగతీసుకొని వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రొద్దుటూరు కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల వ్యభిచార నిర్వాహకులతో కూడా వీరికి సంబంధాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా ఉచ్చులో పడి ఎంతమంది మహిళలు మోసపోయారో అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios