కర్నూలులో ఓ 9యేళ్ల చిన్నారి మీద వీధికుక్కలు దాడి చేశాయి. వెంటాడి వెంటాడి కరిచాయి. వాటి దాడినుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ చిన్నారి. 

కర్నూలు : కర్నూలులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తన్నాయి. కనిపించిన వారిని కనిపించినట్లుగా కరుస్తున్నాయి. మంగళవారం ఉదయం 9యేళ్ల శాన్వి అనే చిన్నాది మీద వీధికుక్కలు దాడి చేశాయి. చిన్నారి పారిపోతుంటే.. వెంటాడి మరీ దాడికి దిగాయి. ఈ దాడిలో శాన్వి తలకు, మెడకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

మూడు కుక్కలు వెంటపడి, వేటాడి దాడి చేయడంతో భయంతో, బాధతో ఆ చిన్నారి పెడుతున్న అరుపులు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీలో నమోదయ్యింది. చిన్నారి అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే కుక్కలను తరిమేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. 

మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో నిహాల్ అనే 11యేళ్ల బాలుడి మీద వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. అదే ప్రాంతంలో మరో బాలిక కుక్కల దాడిలో గాయపడింది.ఈ వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల విషయంలో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.