పోలవరంపై చంద్రబాబుకు షాక్

పోలవరంపై చంద్రబాబుకు షాక్

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ప్రతిపాదనలను కేంద్రం తోసిపుచ్చింది. పోలవరం విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు బుధవారం రాత్రి కేంద్రమంత్రి గడ్కరీతో డిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టేసిందని సమాచారం. గడచిన మూడున్నరేళ్ళల్లో పోలవరం ప్రాజెక్టు పనులు పెద్దగా జరగటం లేదు. ఆ విషయమై ఇంతకాలం జరిగిన రాద్దాంతం అందరికీ తెలిసిందే. దాంతో కొంతకాలంగా ప్రాజెక్టు పనులు కూడా దాదాపు జరగటం లేదు.

ఆ విషయమై తేల్చుకునేందుకే చంద్రబాబు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. పనులు వేగంగా జరగాలంటే కాంట్రాక్టర్ ను మార్చాల్సిందే అని చంద్రబాబు పట్టుబడుతున్నారు. అయితే, తాజా సమావేశంలో కూడా గడ్కరీ, చంద్రబాబు డిమాండ్ ను అంగీకరించలేదు. ‘ప్రస్తుత కాంట్రాక్టర్ తోనే పనులు జరిపించాల’ని ఆదేశించారు. పనులు వేగవంతమయ్యేందుకు నెల రోజులే గడువిచ్చారు. ‘అప్పటికి కూడా పనుల్లో పురోగతి లేకపోతే ఏం చేయాలో అప్పుడే చూద్దా’మంటూ గడ్కరీ తేల్చి చెప్పటంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్ధం కాలేదు.

పైగా ప్రాజెక్టు పనుల పురోగతిని తానే స్వయంగా ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని చెప్పటం కూడా చంద్రబాబుకు మింగుడుపడనిదే. పెరిగిన అంచనా విషయమై రాష్ట్రప్రభుత్వం నుండి నివేదిక పంపితే సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పటం గమనార్హం. పైగా ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు రూ. 3217 కోట్లు పెండింగ్ లో ఉందని చంద్రబాబు చెబుతుండగా, బిల్లులు ఏవీ తమ వద్ద పెండింగ్ లో లేవని గడ్కరీ స్పష్టగా ప్రకటించటం గమనించాలి. ప్రాజెక్టు గడువులోగా పూర్తయ్యే విషయంలో చంద్రబాబునాయుడులో ఉన్న ఆందోళనే తమలోనూ ఉందని గడ్కరీ చెప్పటం గమనార్హం. అయినా సరే గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా పోలవరం పనులు పూర్తి కాదన్న విషయం అందరికీ తెలుసు. సరే, ఆర్ధికంగా, సాంకేతికంగా సహకరిస్తామంటూ చాలాకాలంగా చెబుతున్న మాటలనే మళ్ళీ చెప్పారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos