AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ , కావాల్సిన గుర్తింపు పత్రాల వివరాలు.   

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుక అందించనుంది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ‘స్త్రీశక్తి’ అనే పేరు పెట్టినట్లు నెట్టింట ఓ టికెట్ చక్కర్లు కొడుతోంది. ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని రూ.2.62 కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారు. ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు కానుండగా నేపథ్యంలో మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ , కావాల్సిన గుర్తింపు పత్రాలు గురించి తెలుసుకుందాం.

కావాల్సిన గుర్తింపు పత్రాలు

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పొందాలంటే గుర్తింపు పత్రం తప్పనిసరి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణించే సమయంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు. ఈ టికెట్‌లో ప్రయాణ సమాచారంతో పాటు పథకం ద్వారా ఎంత డబ్బు ఆదా అయ్యిందన్న వివరాలు కూడా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయోజన మహిళలూ ఈ పథకానికి అర్హులు.

ఏఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు?

మహిళల సాధికారతను ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా సహాయపడే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో 74 శాతం అంటే 8,548 బస్సుల్లో ఈ పథకం వర్తించనుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ వంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే విద్యార్థుల కోసం నడిపే బస్సులు, డిపోలలో ఉన్న స్పేర్ బస్సులు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

ఉచిత పథకం వర్తించని బస్సులు:

కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండదు. అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రకటించనున్నారు.