విషాదాంతమైన విహారయాత్ర... గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి
గోదావరి నది ఒడ్డున భర్త్ డే పార్టీ చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు నలుగురు యువకులు నీటమునిగి మృతిచెందిన ఘటన యానాంలో చోటుచేసుకుంది,

రాజమండ్రి : వాళ్ళంతా ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం దసరా సెలవులతో పాటు స్నేహితుల్లో ఒకరి పుట్టినరోజు వుండటంతో సరదాగా విహారయాత్రకు బయలుదేరారు. ఇలా గోదావరి నది అందాలను చూసేందుకు వెళ్లిన స్నేహితులు సరదాగా గడుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడొకడు నదిలో పడి మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించి మరో ముగ్గురు కూడా నీటమునిగారు. ఇలా నలుగురు స్నేహితులు గోదవరిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యానాంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన తిరుమలరావు రవితేజ,భానుప్రసాద్, దుర్గా మహేష్, చైతన్య,కార్తీక్, గణేష్, బాలాజీ లు స్నేహితులు. వీరంతా తరచూ బైక్ లపై లాంగ్ డ్రైవ్ కు వెళుతుండేవారు. నిన్న(శనివారం) కార్తీక్ పుట్టినరోజు వుండటం... ప్రస్తుతం దసరా సెలవులు కూడా వుండటంతో సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని స్నేహితులంతా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మూడు బైక్ లపై ఏడుగురు స్నేహితులు యానాంకు వెళ్లారు.
శనివారం మద్యాహానికి యానాంలోని తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్ కు చేరుకున్నారు. అందమైన గోదావరి ఒడ్డున పార్టీ చేసుకుంటూ కొందరు సరదాగా గోదావరిలోని దిగారు. వీరిలో ఒకరు లోతులోకి వెళ్లి మునిగిపోతుండగా మిగతావారు కాపాడే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు నీటమునిగారు. భయాందోళనకు గురయిన మిగతావారు సాయంకోసం చుట్టపక్కల వెలికినా ఎవ్వరూ కనిపించలేదు. దీంతో వారు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
Read More ఈ తల్లి బాధ మాటలకందనిది... కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే కన్నుమూసిన భర్త (వీడియో)
అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి కార్తీక్, గణేష్, బాలాజీ, రవితేజ గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో వారికోసం గాలింపు చేపట్టారు. యువకులంతా 21 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది. వీరి మృతితో తణుకులో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు యానాంకు చేరుకుని తమ బిడ్డల మృతదేహాలను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.