జైట్లీనే చంద్రబాబు నమ్ముకున్నట్ల కనబడుతోంది ప్రధానిని నమ్ముకుంటే మట్టి, నీళ్ళు చల్లి వెళ్ళిపోయారు ప్రధానిని కాదని జైట్లీ సాయం చేస్తారా?

 ప్రధానమంత్రి నరేంద్రమోడి కన్నా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని నమ్ముకుంటే మంచిదని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే రాజధాని అమరావతి నగర నిర్మాణానికి జైట్లీతో శుక్రవారం అంటే 28వ తేదీన శంకుస్ధాపనకు చంద్రబాబు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ మేరకు జైట్లీ కూడా వస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

ఇప్పటికే ఈ స్ధలంలోనే ఒకసారి తన భార్యతో కలిసి చంద్రబాబు,మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడితో రెండో సారి, తాజాగా జైట్లీతో మూడోసారి శంకుస్ధాపన చేయిస్తున్నారు చంద్రబాబు. ఒకే విషయానికి ఇన్ని సార్లు ప్రముఖులతో ఎందుకు చంద్రబాబు శంకుస్ధాపనలు చేయిస్తున్నారో అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు.

పోయిన సంవత్సరం విజయదశమికి ప్రధానితో శంకుస్ధాపన చేయించినపుడు ప్రధాని నుండి దమ్మిడి సాయం కనీసం ప్రకటనలో కూడా రాలేదు. పైగా చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి మాత్రం మొహాన కొట్టీ మరీ పోయారు మోడి. అయితే, చంద్రబాబు కూడా సభా ముఖంగా ప్రధానిని ఏమీ అడగలేదనుకోండి అది వేరే సంగతి. దాంతో ప్రధాని పని మరీ సులభమైపోయింది.

అప్పట్లో అలా భంగపడిన చంద్రబాబు తాజాగా జైట్లీని పిలిపిస్తున్నారు శంకుస్ధాపనకు. అంటే, ప్రధానమంత్రిని నమ్ముకునేకన్నా జైట్లీని నమ్ముకుంటే మంచిదని అనుకున్నట్లే కనబడుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

అయితే, చంద్రబాబైనా ఇంకెవరైనా గమనించాల్సిందేమిటంటే, ప్రధానమంత్రిని కాదని ఎవరూ ఏమీ చేయలేరన్నవిషయం. ఏపికి ఏ విధంగాను సాయం చేయాలని కేంద్రానికి లేక ప్రధానికి లేదన్న విషయం గడచిన రెండున్నరేళ్ళలోనే ఎన్నో సార్లు తేలిపోయింది. అటువంటిది ప్రధానమంత్రిని కాదని జైట్లీ వచ్చి ఏపికి వరాలిచ్చేస్తారని ఎవరూ అనుకోవటం లేదన్న మాటను చంద్రబాబు గ్రహిస్తే అదే పదివేలు