ఫలించిన చర్చలు: వైసీపీలోకి మాజీ మంత్రి మహీధర్ రెడ్డి

Former minister Maheedhar Reddy may join in Ysrcp on JUne 11
Highlights

మాజీ మంత్రి మహీధర్ రెడ్డి ఈ నెల 11న వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు శనివారం నాడు తిరుపతిలో మహీధర్ రెడ్డితోయ చర్చించారు. దీంతో ఆయన వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు.


ఒంగోలు: మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేతలు తిరుపతిలో మహీధర్‌రెడ్డితో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో  మహీధర్ రెడ్డి వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. కొంత కాలంగా మహీధర్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది దీంతో వైసీపీ నేతలను జగన్ మహీధర్ రెడ్డి వద్దకు పంపారు.

మాజీ మంత్రి మహీధర్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం వైసీపీ ఆ జిల్లాలో ఇంకా బలం చేకూరే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున  మూడు దఫాలు మహీధర్ రెడ్డి  కందుకూరు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు. 

2014వరకు  కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మున్సిఫల్ శాఖ మంత్రిగా కూడ పనిచేశారు.  2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన పోటీకి దూరంగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

మరోవైపు ఇటీవల కాలంలో ఆయన టీడీపీలో చేరాలని భావించినట్టుగా కూడ ప్రచారం సాగింది. అయితే కారణాలేమిటో  తెలియదు కానీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. అయితే 2019 ఎన్నికల్లో  పోటీ చేయాలని మహీధర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన వైసీపీలో చేరాలని ఆయన అనుచరులు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టుగా  సమాచారం.

ఈ తరుణంలోనే కొంత కాలంగా ఆయన  వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కానీ,  కొంత కాలం తర్వాత ఆ ప్రచారం నిలిచిపోయింది..మహీధర్ రెడ్డితో చర్చల కోసం వైసీపీ చీఫ్ జగన్ ఆ పార్టీ నేతలను మహీధర్ రెడ్డి వద్దకు పంపారని చెబుతున్నారు. తిరుపతిలో శ్రీవెకంటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన మహీధర్ రెడ్డితో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, భూమన కరుణారెడ్డి చర్చించారు. వైసీపీలో చేరేందుకు ఆయన తన సంసిద్దతను వ్యక్తం చేశారు.

ఈ తరుణంలో  ఈ నెల 11వ తేదీన  వైసీపీలో చేరనున్నట్టు  మహీధర్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది.జగన్ పాదయాత్రలో ఆయనను కలిసి ఆయన సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు మహీధర్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి   మహీధర్ రెడ్డిని వైసీపీలో చేర్చాలే తెరవెనుక చక్రం తిప్పారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది.
 

loader