శ్రీకాకుళం: ప్రజల తరపున మాట్లాడిన వారి గొంతును  నొక్కేందుకు  ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.  విశాఖ భూ కుంభకోణంలో  తన పేరు రావడంపై  ధర్మాన ప్రసాదరావు స్పందించారు.

గురువారం నాడు ఆయన  శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ భూ రికార్డుల కుంభకోణాన్ని విచారణ చేసిన సిట్ ‌లో రెవిన్యూ అధికారులు ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.

సిట్ విచారణను పోలీసులు ఎలా నిర్వహిస్తారని  ధర్మాన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల తరపున మాట్లాడుతున్నందుకే  సిట్ విచారణలో తన పేరును చేర్చారా అని ప్రశ్నించారు. అయినా తాను ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తానని ధర్మాన స్పష్టం చేశారు. 

విశాఖ భూ కుంభకోణాన్ని సిట్ సక్రమంగా విచారణ చేయలేదన్నారు. ఈ భూముల కుంభకోణం వెనుక ఉన్న  అసలు వ్యక్తులను బయటకు తీయరా అని ఆయన ప్రశ్నించారు. సిట్ విచారణ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు  చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

ఆరోపణలు వచ్చిన 11 రోజుల తర్వాత విచారణ ఫైల్‌ కదిలిందని ఆయన గుర్తు చేశారు. ఇంత ఆలస్యం జరగడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  

సిట్‌ విచారణలో తన పేరు రావడంపై ధర్మాన అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని వైఎస్‌ జగన్‌ ఇదివరకే డిమాండ్‌ చేశారని తెలిపారు. సిట్‌ మీద ఎవరికీ నమ్మకం లేదన్నారు.

భూకుంభకోణంలో ప్రజలు చేస్తున్న డిమాండ్‌ నెరవేరలేదన్నారు. తనపై బురద జల్లి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ధర్మాన అభిప్రాయపడ్డారు.కేబినేట్‌ మినిస్టర్‌ బిజినెస్‌ రూల్లో ఈ వ్యవహారాలు ఉండవన్నారు. 

 రాష్ట్రంలో రెవెన్యూ మినిస్టర్‌కి భూములు ఇచ్చే అధికారం లేదని ఆయన గుర్తు చేశారు. విశాఖ కుంభకోణం వెనక పెద్దల ప్రమేయం ఉందని, సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు వెల్లడవుతాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

భూ రికార్డుల ట్యాంపరింగ్: సిట్ నివేదికలో మాజీ మంత్రి