అమరావతి: విశాఖలో భూ రికార్డుల ట్యాంపరింగ్ చోటు చేసుకొన్నట్టుగా సిట్ నివేదిక వెల్లడించింది. సిట్ నివేదికలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెవిన్యూ మంత్రిగా  పనిచేసి... ప్రస్తుతం విపక్షపార్టీలో కీలకనేత పేరును  సిట్ ప్రస్తావించినట్టు సమాచారం.

విశాఖలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై  2017 జూన్ మాసంలో  వెలుగులోకి వచ్చాయి.దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది.  సిట్ సుమారు 6 మాసాల పాటు  పలువురిని విచారించింది.

సిట్‌కు భూముల రికార్డుల స్కాం విషయానికి  సంబంధించి 3 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి.  వీటన్నింటిని విచారించింది సిట్.  సుమారు 15 ఏళ్ల నుండి విశాఖలో భూ రికార్డుల విషయాన్ని సిట్ దర్యాప్తు చేసింది.

విశాఖపట్టణంలో భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురైనట్టుగా సిట్  నివేదిక వెల్లడించింది. ఈ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిన సమయంలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్‌ కలెక్టర్లు, 10 మంది డీఆర్‌ఓలు పనిచేసినట్టు సిట్ తేల్చింది.

సిట్ నివేదికలో 300 మంది పేర్లను ప్రస్తావించినట్టు సమాచారం. సిట్ నివేదికకు ఏపీ కేబినెట్  మంగళవారం నాడు ఆమోదముద్ర వేసింది. ఈ సిట్ నివేదికను ఆమోదించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకొనేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్.మూడు ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక అధికారులతో ఈ కమిటీ పని చేయనుంది..

ఐఎఎస్ అధికారుల ప్రమేయంతోనే ఈ భూ రికార్డుల ట్యాంపరింగ్‌ చోటు చేసుకొందని సిట్ నివేదిక తేల్చడం  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.1200 ఎకరాల్లో  భూముల రికార్డుల ట్యాంపరింగ్ చోటు చేసుకొందని సిట్ నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదిక ఏపీ రాజకీయాల్లో  ప్రకంపనలు సృస్టించే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

ముగిసిన కేబినేట్ భేటీ:విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ లకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు