తాడేపల్లికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి: సీఎం జగన్ తో భేటీ
సీఎం జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారంనాడు భేటీ అయ్యారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చించనున్నారు.
అమరావతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారంనాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు .సీఎం ఆహ్వానం మేరకు ఆయన జగన్ తో భేటీ కావడం కోసం తాడేపల్లికి వచ్చారు. కర్నూల్ జిల్లా పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
గత నెల 2వ తేదీనే సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోయారు. కొంత కాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ కారణాలతో వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. తన నియోజకవర్గంలో పనిచేసేందుకు సమయం సరిపోని కారణంగానే రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
అయితే గత నెల 2వ తేదీన సీఎం జగన్ ను కలిసి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తాను టిక్కెట్లు ఇప్పించిన వ్యక్తులే తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గ విస్తరణలో ఇదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగించి తనను మంత్రివర్గం నుండి తప్పించంపై అప్పట్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి పదవి నుండి తప్పించినా ప్రోటోకాల్ విషయమై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కానీ రెండు మాసాల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన సీఎం కార్యక్రమంలో బాలినేనిశ్రీనివాస్ రెడ్డిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్కడినుండి వెళ్లి పోయారు.
also read:బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ నుండి పిలుపు: రేపు తాడేపల్లిలో భేటీ
విషయం తెలుసుకున్న సీఎం జగన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తిరిగి రప్పించా రు. ఆ తర్వాత కూడ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలపై జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చించనున్నారు.