విశాఖపట్టణం: ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం అవినీతికి పాల్పడినట్టు ఆరోపిస్తూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం నాడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఈఎస్ఐ స్కాంలో ఏ 14 నిందితుడు కార్తీక్ నుండి ఏపీ మంత్రి జయరాం కొడుకుకు బెంజీ కారును గిఫ్ట్ ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వారం రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అనినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ కు తాను ఫిర్యాదు చేసినా కూడ ప్రభుత్వం నుండి స్పందన రాలేదన్నారు. దీంతో తాను ఏసీబీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

ఏపీ మంత్రి జయరాం కుటుంబానికి బెంజీ కారును గిఫ్ట్ ఇచ్చారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ కారుకు సంబంధించిన ఆధారాలను అయ్యన్న ఏసీబీ అధికారులకు అందించారు. 

also read:ఆ కారు నా కొడుకుది కాదు: అయ్యన్న ఆరోపణలపై మంత్రి జయరాం

ఈఎస్ఐ స్కాంలో ఎలాంటి పాత్ర లేని మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు. అరెస్ట్ చేసే ముందు అప్పటికప్పుడు చేతి రాతతో ఏసీబీ అధికారులు రాశారని ఆయన గుర్తు చేశారు.

ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. గవర్నర్  కూడ స్పందించకపోతే ఏం చేయాలనే దానిపై ఆయన  ఆలోచిస్తానని ఆయన ప్రకటించారు.

మంత్రి జయరాం కుటుంబానికి  ఈఎస్ఐ స్కాంలో నిందితుడు కారు గిఫ్ట్ గా ఇచ్చారని టీడీపీ నేతలు వారం రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై మంత్రి జయరాం కూడ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.