హైదరాబాద్: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు మంగళవారం నాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని  పళ్లంరాజు కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. త్వరలోనే కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  ఉమెన్ చాందీతో సమావేశం కానున్నారు.

ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించిన  ఉమెన్ చాందీ  కాంగ్రెస్ పార్టీలో 2014 వరకు కీలకంగా వ్యవహరించిన నేతలతో సంప్రదింపులు జరపాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. ఈ సూచనతో పాటు  మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని .పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతను  పళ్లంరాజుకు అప్పగిస్తూ  నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు  పళ్లంరాజు హైద్రాబాద్‌లో మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని ఆహ్వానించారు. అయితే తర్వలోనే ఉమెన్ చాందీతో సమావేశమయ్యేందుకు కిరణ్‌కుమార్ రెడ్డి అంగీకరించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడ కిరణ్‌కుమార్ రెడ్డికి సూచించారని సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ గురువుగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని భావిస్తారు. ఇటీవల కాలంలో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఉమెన్ చాందీ ఆదేశాల మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు  పలు విషయాలపై  చర్చించారు. పార్టీలో చేరిక విషయమై కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగానే స్పందించారని సమాచారం.త్వరలోనే ఉమెన్ చాందీతో సమావేశం కావడానికి కిరణ్ అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.