ప్రతీ ఏడాది లక్షలాది మంది తెలుగుభక్తులు శబరిమలకు వెళ్ళటం సంప్రదాయంగా వస్తోంది. అటువంటిది ఏపికి చెందిన తెలుగు వారే ధ్వజస్తంభాన్ని అపవిత్రం చేయటం నిజంగా దురదృష్టం. వీరిచర్యల వల్ల మిగిలిన తెలుగు భక్తులను కూడా అందరూ అనుమానించే ప్రమాదం దాపురించింది ఇపుడు.

పవిత్రమైన శబరిమల ఆలయ ధ్వజస్ధంభాన్ని అపవిత్రం చేసినందుకు ఏపికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసారు. ఆలయ ఇఓ సురేంద్రన్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం బంగారంతో చేసిన ధ్వజస్తంబాన్ని ఏర్పాటు చేసారు. బంగారు తాపడంతో చేసిన ధ్వజస్తంబం ఖర్చు భరించింది కూడా ఏపి వ్యాపారవేత్తలే. అయితే, ఆదివారం మధ్యహ్నం, ఐదుగురు పాదరసంలో ముంచిన గుడ్డను ధ్వజస్తంభం క్రిందిభాగంలో విసిరేసారు. దాంతో గుడ్డ తగిలిన చోట రశాయన ప్రభావం వల్ల బంగారు తాపడం దెబ్బతిన్నది.

ఘటనను చూసిన భక్తులెవరో ఫిర్యాదు చేయగా ఆలయ అధికారులు జరిగిన ఘటనను సిసిటివి ఫుటేజిలో పరిశీలించారు. అందులో ఐదుగురు భక్తుల బృందం ఓ గుడ్డను పాదరసంలో ముంచటం, గుడ్డను ధ్వజస్తంభంపైకి విసిరేయటం అంతా స్పష్టంగా కనబడింది. సిసిటివి ఫుటేజిలో కనబడిన భక్తులను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు కూడా చేసారు. సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, బహుశా ధ్వజస్తంభం చేయించిన భక్తులకు, పాదరసం గుడ్డను విసిరేసిన బృందానికి ఏమన్నా వ్యాపర గొడవలు ఉన్నాయోమే అన్న అనుమానాన్ని వ్యక్తం చేసారు.

ఏదేమైనా ప్రతీ ఏడాది లక్షలాది మంది తెలుగుభక్తులు శబరిమలకు వెళ్ళటం సంప్రదాయంగా వస్తోంది. అటువంటిది ఏపికి చెందిన తెలుగు వారే ధ్వజస్తంభాన్ని అపవిత్రం చేయటం నిజంగా దురదృష్టం. వీరిచర్యల వల్ల మిగిలిన తెలుగు భక్తులను కూడా అందరూ అనుమానించే ప్రమాదం దాపురించింది ఇపుడు. సరే, భక్తులు చేసిన ఘనకార్యాన్ని, అరెస్టు విషయాన్ని పెనమలూరు టిడిపి ఎంఎల్ఏ బోడెప్రసాద్ సిఎం దృష్టికి కూడా తీసుకెళ్ళారు లేండి. చంద్రబాబు ఏం చేస్తారో? ఆలయ అధికారులు వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.